-

క్రికెటర్లు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.. నేనైతే 2011లో: గంభీర్‌

28 Nov, 2023 15:19 IST|Sakshi
ద్రవిడ్‌తో రోహిత్‌ (PC: BCCI)- గంభీర్‌ (PC: X)

ICC ODI WC 2023- Gambhir Comments On Rohit Sharma: వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యాఖ్యలను మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ తప్పుబట్టాడు. రాహుల్‌ ద్రవిడ్‌ను ఉద్దేశించి రోహిత్‌ అలా కామెంట్‌ చేయడం సరికాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు దేశం కోసం మాత్రమే ఆడాలని.. వ్యక్తుల కోసం కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు.

కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన భారత జట్టు ట్రోఫీ గెలుస్తుందన్న ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో రోహిత్‌ సేనను ఓడించి ఆరోసారి విశ్వవిజేతగా చరిత్రపుటల్లోకెక్కింది.

ద్రవిడ్‌ కోసమన్న రోహిత్‌
అయితే, ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కోసం తాము కప్‌ గెలవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. వరల్డ్‌కప్‌-2003లో ద్రవిడ్‌ ఆటగాడిగా ఉన్నపుడు ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓడగా.. 20 ఏళ్ల తర్వాత అతడి మార్గదర్శనంలో తాము ప్రతీకారం తీర్చుకుంటామన్న ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఈ నేపథ్యంలో తాజాగా స్పోర్ట్స్‌కీడా ఇంటర్వ్యూలో గౌతం గంభీర్‌ ఈ విషయంపై స్పందించాడు. దేశం కోసం ఆడాలే తప్ప.. వ్యక్తుల కోసం గెలుస్తామంటూ చెప్పడం సరికాదంటూ రోహిత్‌ వ్యాఖ్యలను విమర్శించాడు. తాను 2011 వరల్డ్‌కప్‌ సమయంలో కూడా ఇదే మాట సహచర ఆటగాళ్లతో చెప్పానని పేర్కొన్నాడు.

సచిన్‌ కోసం నాడు ట్రోఫీ గెలిచామంటూ
కాగా మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలోని టీమిండియా వరల్డ్‌కప్‌- 2011 చేరినపుడు.. సచిన్‌ టెండుల్కర్‌ కోసం తాము ట్రోఫీ గెలుస్తామంటూ కొంతమంది ఆటగాళ్లు చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే సచిన్‌ సొంతమైదానం వాంఖడేలో శ్రీలంకను ఓడించి విజయాన్ని అతడికి బహుమతిగా అందించారు.

ఈ రెండు సందర్భాల్లో ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ గంభీర్‌.. ‘‘అసలు క్రికెటర్లు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారో నాకు ఇంతవరకూ అర్థం కాలేదు. ఒక వ్యక్తి కోసం తాము గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పడం సరికాదు.

ఇలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు
దేశం కోసం మనం టైటిల్‌ గెలవాలి అనుకోవాలి. ఒకవేళ మీరు ఓ వ్యక్తి కోసం ఇలా చేయాలని భావిస్తే అలాంటివి మీడియా ముందు చెప్పడం ఎందుకు? 2011లో చాలా మంది నాతో.. ‘‘మనం వ్యక్తి కోసం గెలవాలి’’అని చెప్పారు.

కానీ నేను మాత్రం బ్యాట్‌ చేతబట్టి నా దేశం కోసం గెలుస్తానని వాళ్లందరికీ చెప్పాను’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. కాగా గౌతం గంభీర్‌ ఐపీఎల్‌తో బిజీ కానున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ 2024 సీజన్‌ సందర్భంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారిన గౌతీ.. ఆజట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.

చదవండి: మనుషులు దూరంగా ఉన్నా.. విరాట్‌ కోహ్లి తోబుట్టువు, వ్యాపారవేత్త భార్య!

మరిన్ని వార్తలు