ROI Vs MP: టీమిండియాలో చోటు కోసం దూసుకొస్తున్న మరో యువ కెరటం.. డెబ్యూలోనే డబుల్‌ సెంచరీ, సెంచరీ

4 Mar, 2023 12:43 IST|Sakshi

Yashasvi Jaiswal: భారత యువ కెరటం, ఉత్తర్‌ప్రదేశ్‌ బార్న్‌ ముంబై క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ దేశవాలీ టోర్నీ ఇరానీ కప్‌లో ఇరగదీశాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి.. అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు), సెంచరీతో (132 బంతుల్లో 121 నాటౌట్‌; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టి, టీమిండియాలో చోటు కోసం దూసుకొస్తున్నాడు. ఇటీవలి కాలంలో దేశవాలీ క్రికెట్‌లో ఫార్మాట్లకతీతంగా విజృంభిస్తున్న యశస్వి.. పలు సంచలన ప్రదర్శనల నమోదు చేసి, నేను కూడా టీమిండియా ఓపెనర్‌ రేసులో ఉన్నానని భారత సెలక్టర్లకు సవాలు విసురుతున్నాడు.

మధ్యప్రదేశ్‌తో ఇరానీ కప్‌ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యశస్వి.. ఒకే మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీ సాధించడం ద్వారా పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఇరానీ కప్‌లో ఒకే మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ నమోదు చేసిన ఏకైక బ్యాటర్‌గా.. శిఖర్‌ ధవన్‌ తర్వాత ఇరానీ కప్‌ మ్యాచ్‌లో 300 ప్లస్‌ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా.. ఒకే ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీ నమోదు చేసిన 11వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ప్రస్తుత దేశవాలీ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న యశస్వి.. కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మార్కును అందుకుని, ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్‌ నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల యశస్వికి అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ బాదడం కొత్తేమి కాదు. దులీప్‌ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్‌ సెంచరీతో విజృంభించాడు. ఈ ట్రోఫీలో వెస్ట్‌ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన యశస్వి.. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై 227 పరుగులు చేశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనూ యశస్వి సెంచరీతో చెలరేగాడు. 2022 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 146 పరుగులు స్కోర్‌ చేశాడు.   

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (213) డబుల్‌ సెంచరీతో చెలరేగగా.. అభిమన్యు ఈశ్వరన్‌ (154) సెంచరీతో కదం తొక్కాడు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. అనుభవ్‌ అగర్వాల్‌, కుమార్‌ కార్తీకేయ తలో 2 వికెట్లు, అంకిత్‌ కుష్వా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌.. పుల్కిత్‌ నారంగ్‌ (4/65), నవ్‌దీప్‌ సైనీ (3/56), ముకేశ్‌ కుమార్‌ (2/44), సౌరభ్‌ కుమార్‌ (1/74) ధాటికి 294 పరుగులకే చాపచుట్టేసింది. యశ్‌ దూబే (109) సెంచరీతో రాణించగా.. హర్ష​ గవ్లీ (54), సరాన్ష్‌ జైన్‌ (66) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించారు.

190 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా.. నాలుగో రోజు లంచ్‌ సమయానికి 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి, ఓవరాల్‌గా 391 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. యశస్వి (121) అజేయమైన సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. మధ్యప్రదేశ్‌ బౌలర్లు ఆవేశ్‌ ఖాన్‌, అంకిత్‌ ఖుష్వా తలో 2 వికెట్లు, కుమార్‌ కార్తీకేయ, సరాన్ష్‌ జైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

>
మరిన్ని వార్తలు