బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో ప్రమాదం

30 Nov, 2020 01:12 IST|Sakshi

స్వల్ప గాయాలతో బయటపడ్డ హాస్‌ జట్టు డ్రైవర్‌ గ్రోస్యెన్‌

సాఖిర్‌: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి రేసులో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. తొలి ల్యాప్‌లో హాస్‌ జట్టు డ్రైవర్‌ రొమైన్‌ గ్రోస్యెన్‌ నియంత్రణ కోల్పోయి ట్రాక్‌ పక్కనున్న బారికేడ్లను ఢీకొట్టాడు. వెంటనే అతని కారులో మంటలు చెలరేగాయి. కారు కాక్‌పిట్, చాసిస్‌ వేర్వేరుగా రెండు ముక్కలైపోయాయి. మంటలు చెలరేగిన వెంటనే గ్రోస్యెన్‌ సమయస్ఫూర్తితో స్పందించి కారులో నుంచి బయటకు వచ్చి బారికేడ్లను దాటి సురక్షిత ప్రదేశానికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అక్కడే ఉన్న సహాయక బృందం కూడా వేగంగా స్పందించి గ్రోస్యెన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. గ్రోస్యెన్‌ రెండు చేతులకు, మోకాలికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనతో రేసును గంటన్నరపాటు నిలిపివేశారు. మంటలను పూర్తిగా ఆపేశాక రేసును కొనసాగించారు. రేసు పునఃప్రారంభమయ్యాక రెండో ల్యాప్‌లోనే రేసింగ్‌ పాయింట్‌ జట్టు డ్రైవర్‌ లాన్స్‌ స్ట్రాల్‌ కారు పల్టీలు కొట్టి ట్రాక్‌ బయటకు వెళ్లింది. 57 ల్యాప్‌ల ఈ రేసును పోల్‌ పొజిషన్‌తో ప్రారంభించిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లోకి హామిల్టన్‌కిది 11వ విజయం కావడం విశేషం.

>
మరిన్ని వార్తలు