Cristiano Ronaldo: ప్రాక్టీస్‌ సెషన్‌కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా?

8 Dec, 2022 19:08 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మంగళవారం పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌ మధ్య ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు పోర్చుగల్‌ కెప్టెన్‌.. ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను పక్కనబెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. కీలక నాకౌట్‌ దశలో రొనాల్డో డగౌట్‌లో కూర్చోవడం చాలా మందిని బాధించింది. అయితే రొనాల్డోస స్థానంలో జట్టులోకి వచ్చిన రామోస్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరవడం.. ఆపై మరో ముగ్గురు పోర్చుగల్‌ ఆటగాళ్లు గోల్స్‌తో దుమ్మురేపారు. దీంతో పోర్చుగల్‌ 6-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 

ఇదిలా ఉంటే తనను జట్టు నుంచి తప్పించారన్న అవమానం తట్టుకోలేక రొనాల్డో ప్రాక్టీస్‌ సెషన్‌కు డుమ్మా కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తన జూనియర్లతో కలిసి ప్రాక్టీస్‌ చేయడానికి రొనాల్డో ఇష్టపడలేదని.. రోజు మొత్తం జిమ్‌లో గడపడానికే ప్రాధాన్యం ఇచ్చాడంటూ స్పెయిన్‌కు చెందిన ఒక వార్తపత్రిక తన కథనంలో వెల్లడించింది. 

ఇక రొనాల్డోను ఆడించకపోవడంపై జట్టు మేనేజర్‌ ఫెర్నాండో సాంటోస్‌ స్పందించాడు. ''రొనాల్డోతో విబేధాలున్నాయన్న మాట నిజం కాదు.అతను ఒక స్టార్‌ ఆటగాడు. రొనాల్డో లేకుండా జట్టు బలాలు, బలహీనతలు తెలుసుకోవాలని ప్రయత్నించాం. రొనాల్డో స్థానంలో జట్టులోకి వచ్చిన గొంకాలో రమోస్‌ సూపర్‌గా రాణించాడు. అలా అని రొనాల్డోను పక్కనబెట్టలేం. కానీ మొరాకోతో జరగనున్న క్వార్టర్స్‌లోనూ రొనాల్డో ఆడకపోవచ్చు. కొత్త వాళ్లకు అవకాశాలు రావాలి. మేం కరెక్ట్‌ స్ట్రాటజీతోనే వెళ్తున్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక స్విట్జర్లాండ్‌తో జరిగిన ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌కు హాజరైన అభిమానులు రొనాల్డో.. రొనాల్డో అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆట 73వ నిమిషంలో రొనాల్డో గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. జావో ఫెలిక్స్‌ స్థానంలో వచ్చిన రొనాల్డో గోల్‌ కొట్టడంలో మాత్రం విఫలమయ్యాడు.

ఫిఫా ప్రపంచకప్ లో పోర్చుగల్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న కొద్దిరోజుల క్రితమే  మాంచెస్టర్‌ యునైటెడ్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో  మాంచెస్టర్ యూనైటెడ్ నుంచి బయటకు వచ్చినట్టు  ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.  అప్పటినుంచి రొనాల్డో ఏ ఫ్రాంచైజీకి సంతకం చేయలేదు. అయితే సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ కు ఆడనున్నాడనే  వార్తలు వస్తున్నాయి. మూడేండ్ల పాటు అల్ నజర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. ప్రతీ యేటా సుమారు రూ. 600 కోట్లకు పైగా  రొనాల్డోకు ముట్టజెప్పేందుకు  డీల్ ఓకే అయిందని  కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రొనాల్డో ఖండించాడు.

చదవండి: FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా?

మరిన్ని వార్తలు