Ross Taylor About Racism: రాస్‌ టేలర్‌ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్‌ ఉత్తదేనా!

11 Aug, 2022 15:45 IST|Sakshi

న్యూజిలాండ్‌కు క్రికెట్‌లో ఎలాంటి వివాదాలు లేని జట్టు అనే పేరుంది. అందుకు తగ్గట్లే జట్టులోని ఆటగాళ్లు తమ హుందాతనాన్ని చూపిస్తారు. ఇప్పటివరకు కివీస్‌ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవ పడ్డ దాఖలాలు కానీ.. కవ్వింపు చర్యలకు పాల్పడడం గానీ ఎరిగింది లేదు. ఒకవేళ జరిగినా కూడా గుర్తుంచుకునేంత పెద్దవి కావు. అలాంటి న్యూజిలాండ్‌కు "కూల్‌ జట్టు" అనే ట్యాగ్‌లైన్‌ ఉంది. 

ఇటీవలే కివీస్‌ మాజీ క్రికెటర్‌ ​రాస్‌ టేలర్‌ తన 16 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. తాజాగా తన ఆటోబయోగ్రఫీ ద్వారా న్యూజిలాండ్‌ క్రికెట్‌పై ఒక బాంబు పేల్చాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో తోటి ఆటగాళ్లచే తాను వివక్ష ఎదుర్కొన్నట్లు "రాస్‌ టేలర్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌"లో సుధీర్ఘంగా పేర్కొన్నాడు. టేలర్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం కివీస్‌ క్రికెట్‌లో సంచలనం కలిగిస్తోంది. టేలర్‌ వ్యాఖ్యలతో కివీస్‌కున్న ట్యాగ్‌లైన్‌ ఉత్తదేనా అనిపిస్తుంది.

"నా 16 ఏళ్ల కెరీర్‌ అంతా సక్రమంగా జరిగిందనేది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో మీకు తెలియని వివక్ష ఒకటి షేర్‌ చేసుకోవాలనుకుంటున్నా. కివీస్‌ క్రికెట్‌కు మంచి పేరు ఉంది. దానిని నేను చెడగొట్టదలచుకోలేను. కానీ సొంతజట్టుకు చెందిన కొందరు క్రికెటర్లు.. నా మొహం గురించి కామెంట్‌ చేసేవారు. నువ్వు న్యూజిలాండ్‌కు ఆడుతున్నప్పటికి నీలో ఆసియా మూలాలు కనిపిస్తున్నాయి. పొరపాటు మా దేశంలో క్రికెట్‌ ఆడుతున్నావనుకుంటా అని పేర్కొనేవాళ్లు. 

రాస్‌.. నువ్వు సగం మాత్రమే మంచోడివి.. మిగతా సగం ఏంటనేది నువ్వే నిర్ణయించుకో అని ఒక తోటి క్రికెటర్‌ హేళన చేసేవాడు. ఇదంతా డ్రెస్సింగ్‌రూమ్‌ వరకు మాత్రమే పరిమితం. మళ్లీ మైదానంలోకి వచ్చామంటే అంతా మాములే. అందుకే న్యూజిలాండ్‌ క్రికెట్‌లో వివక్ష ఎక్కడా కంటికి కనబడదు.. కానీ అంతా తెరవెనుక జరుగుతుంది. అందుకే మా డ్రెస్సింగ్‌రూమ్‌ను నేను ఒక బారోమీటర్‌గా అభివర్ణిస్తున్నా. మొదట్లో అలా అంటుంటే ఏదో సరదాకు అంటున్నారులే అని అనుకునేవాడిని.. కొన్నాళ్లు పోయిన తర్వాత కూడా అదే పనిగా మాట్లాడడంతో వివక్షకు గురవుతున్నానని అర్థమయింది.

జట్టులో నన్ను చాలా మంది భారతీయ లేదా ఆసియా మూలాలు ఉన్న క్రికెటర్‌గా చూసేవారు. ఎందుకంటే పసిఫిక్‌ మహాసముద్రానికి దగ్గరగా ఉండే న్యూజిలాండ్‌ ప్రాంతంలో నా మూలాలున్న ఆటగాళ్లు చాలా తక్కువగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే డ్రెస్సింగ్‌రూమ్‌లో వివక్ష ఎదుర్కొన్నప్పటికి ఆ విషయాలను ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పటికి బయటికి చెప్పలేకపోయాను'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.

టేలర్ కెరీర్ ను 2011 వన్డే ప్రపంచకప్ మార్చేసింది. అప్పటి వరకు సాధారణ ప్లేయర్ గా ఉన్న అతడిని హీరోగా మార్చేసింది. భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ తర్వాత నుంచి రాస్ టేలర్ ను ఏ బౌలర్ కూడా అంత తక్కవగా అంచనా వేయలేదు. ఆ ప్రపంచకప్ లో రాస్ టేలర్... 324 పరుగులు చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో మెరిశాడు. జట్టు 175 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన స్థితి నుంచి 302/7కు చేర్చడంలో అసమాన పోరాటాన్ని ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ లో టేలర్ 131 పరుగులతో అజేయంగా నిలిచాడు.

38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు  ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్గా రాస్ టేలర్ నిలిచాడు.

చదవండి: Sourav Ganguly Resign: దాదాకు తప్పని ఫేక్‌న్యూస్‌ గోల..  ఇది వారి పనేనా?

SA vs ENG: టాప్‌ స్కోరర్‌గా నిలిచి.. అంత గుడ్డిగా ఎలా ఔటయ్యాడు!

మరిన్ని వార్తలు