Ross Taylor-Rahul Dravid: ఎదురుగా పులులు కనిపిస్తున్నా.. అందరి కళ్లు ద్రవిడ్‌పైనే!

14 Aug, 2022 16:34 IST|Sakshi

న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ తన ఆత్మకథ ''బ్లాక్‌ అండ్‌ వైట్‌'' ద్వారా ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నాడు. రెండురోజుల క్రితం సొంత జట్టు క్రికెటర్లే వివక్ష చూపారంటూ సంచలన వార్త బయటపెట్టిన టేలర్‌.. శనివారం.. ఐపీఎల్‌ సందర్భంగా ఒక మ్యాచ్‌లో డకౌట్‌ అయినందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాని ఒకరు తన చెంప పగులగొట్టారంటూ మరొక సంచలన విషయం బయటపెట్టాడు.

తాజాగా టీమిండియా మాజీ క్రికెట్‌.. ప్రస్తుత భారత హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌తో జరిగిన అనుభవాన్ని తన ఆత్మకథలో రాసుకొచ్చాడు. 2011 ఐపీఎల్‌ సందర్భంగా రాస్‌ టేలర్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అదే జట్టులో షేన్‌ వార్న్‌ సహా రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఉన్నారు. వారితో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్న టేలర్‌.. అప్పట్లో బయట టీమిండియా ఆటగాళ్లకు పాపులారిటీ ఎంతనేది కళ్లారా చూశానంటూ పేర్కొన్నాడు.

''2011 ఐపీఎల్‌ సందర్భంగా ఒకసారి ద్రవిడ్‌తో కలిసి రాజస్థాన్‌లోని రణతంబోర్‌ జాతీయ పార్కును సందర్శించా. ఈ సందర్భంగా ద్రవిడ్‌ను.. మీరెన్ని సార్లు పులులను సందర్శించారు. అని అడిగాను. దానికి ద్రవిడ్‌.. లేదు ఇంతవరకు ఒక్క పులిని కూడా దగ్గరి నుంచి చూడలేదు. ఇది 21వ సపారీ అనుకుంటా.. కానీ ఒక్క పులిని కూడా చూడలేకపోయా అని చెప్పాడు. దీంతో ఏంటి 21 సార్లు సఫారీకి వచ్చినా ఒక్కసారి కూడా పులిని చూడకపోవడం ఏంటి. అని ఆశ్చర్యపోయా.

ఆ తర్వాత అందరం కలిసి ఎస్‌యూవీ మోడల్‌  ఓపెన్‌ టాప్‌ కారులో సఫారీకి వెళ్లాం. దాదాపు 100 మీటర్ల దూరంలో ఒక aపులిని చూశాం.  ద్రవిడ్‌.. నావల్ల ఈరోజు నువ్వు పులిని దగ్గర్నుంచి చూశావు.. దానికి థ్యాంక్స్‌ చెప్పాలి అని పేర్కొన్నాను. ఇక మా మధ్య ఏవో మాటలు సందర్బంలో వచ్చాయి. ఈ సమయంలోనే నేనొక అద్భుత విషయాన్ని గమనించా. అది చూశాకా భారత్‌లో క్రికెటర్లను ఇంతలా ఎందుకు అభిమానిస్తారా అని ఆశ్చర్యమేసింది.

అదేంటంటే.. మేము వెళ్తున్న వాహనం వెనకాల వస్తున్న మరో సఫారీ వాహనంలో కొంతమంది వస్తున్నారు. అప్పటిదాకా కనిపిస్తున్న పులులను తమ కెమెరాల్లో బందిస్తున్న వాళ్లు.. అది ఆపేసి ఒక్కసారిగా కెమెరాలన్నింటిని ద్రవిడ్‌వైపు తిప్పారు. అంటే ఒక జాతీయ పార్క్‌కు వచ్చి.. ఎదురుగా అరుదైన పులి జాతి సంపద కనిపిస్తున్నా సరే.. అందరు ద్రవిడ్‌నే చూడడం నాకు ఆసక్తి కలిగించింది. ఈ సందర్భంగా ఒక విషయం కోట్‌ చేయలానుకున్నా.. 'ప్రపంచంలో సుమారు 4వేల పులులు ఉండుంటాయి.. కానీ వాటికి మించిన ప్రత్యేకం రాహుల్‌ ద్రవిడ్‌' అన్న విషయం కచ్చితంగా చెప్పగలను'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 

38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు  ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్‌గా రాస్ టేలర్ నిలిచాడు.

చదవండి: Ross Taylor About Racism: రాస్‌ టేలర్‌ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్‌ ఉత్తదేనా!

Asia Cup 2022: ఆసియా కప్‌ ముంగిట.. భారత అభిమానుల్లో 'జెర్సీ' భయం

మరిన్ని వార్తలు