Rovman Powell: మూడు పరుగులతో శతకం మిస్‌.. చేయాల్సిన విధ్వంసం చేసేశాడు

23 Jan, 2023 08:26 IST|Sakshi

విండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20(ILT20) క్రికెట్‌లో తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన పావెల్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. దుబాయ్‌ క్యాపిటల్స్‌, ముంబై ఎమిరేట్స్‌ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటైనప్పటికి చేయాల్సిన విధ్వంసం అంతా చేసిపారేశాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. అతనికి తోడుగా జో రూట్‌ కూడా 54 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇక వెస్టిండీస్‌ తరపున రోవ్‌మెన్‌ పావెల్‌ 45 వన్డేల్లో 897 పరుగులు, 55 టి20ల్లో 890 పరుగులు సాధించాడు.

మ్యాచ్‌ విషయానికి వస్తే దుబాయ్‌ క్యాపిటల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దుబాయ్‌ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్‌ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్‌ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 

అనంతరం బ్యాటింగ్‌ చేసిన ముంబై ఎమిరేట్స్‌ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్‌ పొలార్డ్‌(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.

చదవండి: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్‌ ముద్ర చెరిపేయాల్సిందే

>
మరిన్ని వార్తలు