Rovman Powell: 'మూడురోజులు టవల్‌ చుట్టుకునే.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు'

10 May, 2022 12:40 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు విజయాలు.. ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ తాను ఆడబోయే చివరి మూడుమ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లేఆఫ్‌ చేరే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో ఖంగుతిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. 

ఈ విషయం పక్కనబెడితే.. ఢిల్లీ హార్డ్‌ హిట్టర్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ 'ఎపిసోడ్‌-6 విత్‌ పావెల్‌' పాడ్‌కాస్ట్‌ ఇంటర్య్వూ నిర్వహించింది. ఇంటర్య్వూలో పావెల్‌ తన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.'' ఐపీఎల్‌ 2022 సీజన్‌ కోసం ముంబైలో అడుగుపెట్టినప్పుడు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు నా హ్యాండ్‌ బాగ్‌ తప్ప మరెలాంటి బట్టలు లేవు.. అవి ఎక్కడో మిసయ్యాయి. ఆ తర్వాత హోటల్‌ రూంలో మూడురోజుల పాటు టవల్‌ చుట్టుకునే గడిపాను. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు.'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.


PC: IPL Twitter
''ఇక ఐపీఎల్‌ కోసం కరిబీయన్‌ నుంచి ఇండియాకు వచ్చాను. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ బాగానే రిసీవ్‌ చేసుకుంది. ఢిల్లీతో ఉంటే సొంతజట్టుతో ఉన్నట్లే అనిపిస్తుంది. నేను ఆటగాడిగా రాణించినా.. రాణించకపోయినా జట్టు మద్దతు అనేది ముఖ్యం. ఆ విషయంలో మాత్రం నాకు డోకా లేదు. ఇది మంచి విషయం. రిషబ్‌ పంత్‌ మంచి ఆటగాడు మాత్రమే కాదు.. గుడ్‌ కెప్టెన్‌ కూడా. అంతర్జాతీయ క్రికెట్‌లో పంత్‌కు ప్రత్యర్థిగా ఆడినప్పటికి మంచి స్నేహితులుగానే ఉంటాము. జట్టులో చోటు కల్పించడం.. నా రోల్‌ను సమర్థంగా పోషించేందుకు సాయపడతానని పంత్‌ అన్నాడు. తాజాగా మా కెప్టెన్‌ తన మాటకు కట్టుబడ్డాడు'' అంటూ చెప్పుకొచ్చాడు. 

కాగా ఈ సీజన్‌లో రోవ్‌మెన్‌ పావెల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 మ్యాచ్‌లాడిన పావెల్‌ 205 పరుగులు సాధించాడు. పావెల్‌ ఖాతాలో ఒక అర్థసెంచరీ ఉంది.

చదవండి: Shreyas Iyer: 'ఏం చేయాలో తెలియని స్థితి.. చివరకు సీఈవో జోక్యం'

మరిన్ని వార్తలు