డివిలియర్స్‌ ధమాకా

13 Oct, 2020 04:32 IST|Sakshi

షార్జాలో ఏబీ మెరుపులు

కోల్‌కతాపై 82 పరుగులతో బెంగళూరు విజయం

అబ్రహాం బెంజమిన్‌ (ఏబీ) డివిలియర్స్‌ ఐపీఎల్‌లో తన విలువేంటో మరోసారి చూపించాడు. ఇతర బ్యాట్స్‌మన్‌ ఒక్కో పరుగు కోసం శ్రమించిన చోట అతను మెరుపు షాట్లతో చెలరేగిపోయాడు. 220కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో అతను సాగించిన ధాటి బెంగళూరు అభిమానులకు చిన్నస్వామి మైదానాన్ని గుర్తుకు తెస్తే వీక్షకులకు వినోదాన్ని పంచింది. టాప్‌ గేర్‌లో సాగిన డివిలియర్స్‌ ఆటకు కోహ్లి సహకారం తోడు కావడంతో భారీ స్కోరు సాధించిన ఆర్‌సీబీ... కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కతాను కుప్పకూల్చింది. శుబ్‌మన్‌ గిల్‌ ప్రయత్నం మినహా... జట్టులో ఇతర ఆటగాళ్లెవరూ కనీస ప్రదర్శన కూడా ఇవ్వకపోవడంతో విజయాలకు బ్రేక్‌ పడింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న ఆ జట్టు ఈసారి ఛేదనలో చేతులెత్తేసింది.
   
షార్జా: ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మోమున మళ్లీ చిరునవ్వు! ఐపీఎల్‌లో నెమ్మదిగా నిలదొక్కుకున్న ఆ జట్టు ఐదో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 82 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. తాజా సీజన్‌లో ఒక జట్టుకు ఇదే అతి పెద్ద విజయం. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఏబీ డివిలియర్స్‌ (33 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో చెలరేగిపోగా... ఫించ్‌ (37 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కోహ్లి (28 బంతుల్లో 33 నాటౌట్‌; 1 ఫోర్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుబ్‌మన్‌ గిల్‌ (25 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) తప్ప అంతా విఫలమయ్యారు. మోరిస్, సుందర్‌ చెరో 2 వికెట్లు తీశారు. నరైన్‌ బౌలింగ్‌ శైలిపై సందేహాలు వచ్చిన నేపథ్యంలో కోల్‌కతా జట్టు ముందు జాగ్రత్త ప్రదర్శించింది. మరోసారి అంపైర్లు ఫిర్యాదు చేస్తే సస్పెండ్‌ అయ్యే ప్రమాదం ఉండటంతో ఇప్పుడు తుది జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టింది. నరైన్‌ స్థానంలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ బాంటన్‌ జట్టులోకి వచ్చాడు. అతనికి ఇదే తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌.  

ఫించ్‌ నెమ్మదిగా...
బెంగళూరుకు ఓపెనర్లు ఫించ్, పడిక్కల్‌ శుభారంభాన్ని అందించారు. అయితే పడిక్కల్‌ వేగంగా ఆడగా, ఫించ్‌లో అది లోపించింది. ఒకదశలో ఏడు బంతుల వ్యవధిలో 4 ఫోర్లతో పడిక్కల్‌ దూకుడు ప్రదర్శించాడు. 19 పరుగుల వద్ద ఫించ్‌ ఇచ్చిన క్యాచ్‌ను నాగర్‌కోటి వదిలేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 47 పరుగులకు చేరింది. రసెల్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ బౌల్ట్‌ కావడంతో బెంగళూరు తొలి వికెట్‌ కోల్పోయింది. కొద్ది సేపటికే ఫించ్‌ను ప్రసిధ్‌ కృష్ణ బౌల్డ్‌ చేశాడు.  

విధ్వంసం సాగిందిలా...
ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌ మూడో బంతికి డివిలియర్స్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. ఆ సమయంలో జట్టు స్కోరు 90/1. అప్పటి వరకు చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి కట్టడి చేసిన కోల్‌కతా ఏబీ దూకుడు ముందు తేలిపోయింది. ప్రసిధ్‌ ఓవర్లో ఫోర్‌తో ఖాతా తెరిచిన డివిలియర్స్‌... నాగర్‌కోటి ఓవర్‌తో దూసుకుపోయాడు. ఈ ఓవర్లో అతను 2 సిక్సర్లు, ఫోర్‌ కొట్టాడు. ఇక కమిన్స్‌ వేసిన తర్వాతి ఓవర్లో కూడా అతను ఇలాగే 2 సిక్సర్లు, ఫోర్‌ బాదాడు. రసెల్‌ ఓవర్లో వరుసగా కొట్టిన 4, 6తో 23 బంతుల్లోనే ఏబీ అర్ధ సెంచరీ పూర్తయింది. వికెట్ల మధ్య కూడా చురుగ్గా పరుగెడుతూ ఐదుసార్లు రెండేసి పరుగుల చొప్పున సాధించిన అతడు... రసెల్‌ వేసిన చివరి ఓవర్లో మరో సిక్స్, ఫోర్‌తో ముగించాడు. నాగర్‌కోటి బౌలింగ్‌లో కొట్టిన సిక్సర్‌ స్టేడియం బయట రోడ్డుపై వెళుతున్న కారుపై పడగా... ఆఖరి ఓవర్లో రసెల్‌ వేసిన యార్కర్‌ను పాయింట్‌ దిశగా ఫోర్‌గా మలచిన షాట్‌ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది.  

కోహ్లి ప్రేక్షకుడిలా...
వరల్డ్‌ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ కోహ్లి బ్యాటింగ్‌ చేస్తుంటే సాధారణంగా మరో ఎండ్‌లోని ప్లేయర్‌ ఆధిపత్యం ప్రదర్శించడం అరుదు. గతంలో గేల్, డివిలియర్స్‌లు భీకరంగా ఆడిన సమయంలో కోహ్లి కూడా దాదాపుగా వారితో పరుగుల కోసం పోటీ పడేవాడు. కానీ ఈ మ్యాచ్‌లో భిన్నమైన దృశ్యం కనిపించింది. అతని ఆట చాలా నెమ్మదిగా సాగింది. చెన్నైతో ఆడిన గత ఇన్నింగ్స్‌తో పోలిస్తే ఎక్కడా ఆ దూకుడు కనిపించలేదు. డివిలియర్స్‌ ఊచకోత కోస్తుండగా, కోహ్లి మాత్రం సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. జోరు మీదున్న డివిలియర్స్‌కే ఎక్కువగా బ్యాటింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒకే ఒక ఫోర్‌ తాను ఆడిన 25వ బంతికి వచ్చింది! డివిలియర్స్, కోహ్లి భాగస్వామ్యంలో మొత్తం 47 బంతులు ఉండగా... ఇందులో 33 ఏబీ, 14 మాత్రమే కోహ్లి ఆడారు.  

సమష్టి వైఫల్యం...
కేకేఆర్‌ మొత్తం ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే ఉన్నాయంటే జట్టు బ్యాటింగ్‌ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఏ దశలో కూడా జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. కొత్త ఆటగాడు బాంటన్‌ (8)ను సైనీ బౌల్డ్‌ చేయగా, నితీశ్‌ రాణా (9)ను సుందర్‌ ఇలాగే వెనక్కి పంపించాడు. మోర్గాన్‌ (8)తో సమన్వయ లోపంతో గిల్‌ రనౌటైన తర్వాత నైట్‌రైడర్స్‌ పతనం వేగంగా సాగింది. రెండు పరుగుల వ్యవధిలో దినేశ్‌ కార్తీక్‌ (1), మోర్గాన్‌ వెనుదిరిగారు. సగం వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునే భారం రసెల్‌ (16), రాహుల్‌ త్రిపాఠి (16)లపై పడింది. ఉదాన ఓవర్లో వరుసగా 4, 6, 4 బాది దూకుడు పెంచినట్లు కనిపించిన రసెల్‌ అదే ఓవర్లో అవుటయ్యాడు. దాంతో కోల్‌కతా గెలుపు ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈ దశలో 31 బంతుల్లో 106 పరుగులు చేయాల్సి ఉండటంతో మిగిలిన ఇన్నింగ్స్‌ లాంఛనమే అయింది.  

స్కోరు వివరాలు  
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: ఫించ్‌ (బి) ప్రసిధ్‌ 47; దేవ్‌దత్‌ పడిక్కల్‌ (బి) రసెల్‌ 32; కోహ్లి (నాటౌట్‌) 33; డివిలియర్స్‌ (నాటౌట్‌) 73; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–67; 2–94.
బౌలింగ్‌: కమిన్స్‌ 4–0–38–0; ప్రసిధ్‌ కృష్ణ 4–0–42–1; రసెల్‌ 4–0–51–1; వరుణ్‌ 4–0–25–0; నాగర్‌కోటి 4–0–36–0.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: బాంటన్‌ (బి) సైనీ 8; గిల్‌ (రనౌట్‌) 34; రాణా (బి) సుందర్‌ 9; మోర్గాన్‌ (సి) ఉదాన (బి) సుందర్‌ 8; కార్తీక్‌ (బి) చహల్‌ 1; రసెల్‌ (సి) సిరాజ్‌ (బి) ఉదాన 16; త్రిపాఠి (సి) మోరిస్‌ (బి) సిరాజ్‌ 16; కమిన్స్‌ (సి) పడిక్కల్‌ (బి) మోరిస్‌ 1; నాగర్‌కోటి (బి) మోరిస్‌ 1; వరుణ్‌ (నాటౌట్‌) 7; ప్రసిధ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 112.  
వికెట్ల పతనం: 1–23; 2–51; 3–55; 4–62; 5–64; 6–85; 7–89; 8–99; 9–108.  
బౌలింగ్‌: మోరిస్‌ 4–0–17–2; సైనీ 3–0–17–1; సిరాజ్‌ 3–0–24–1; సుందర్‌ 4–0–20–2; చహల్‌ 4–0–12–1; ఉదాన 2–0–19–1. 

మరిన్ని వార్తలు