RCB Vs PBKS: బెంగళూరు బహు బాగు... ‘ప్లే ఆఫ్స్‌’లోకి!

4 Oct, 2021 05:07 IST|Sakshi

ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టిన ఆర్‌సీబీ

6 పరుగులతో పంజాబ్‌పై విజయం

గెలిపించిన మ్యాక్స్‌వెల్, చహల్‌  

ఐపీఎల్‌–2021 రెండో దశ (యూఈఏ)లో తొలి మ్యాచ్‌లో 92 ఆలౌట్‌తో చిత్తు... ఆపై తర్వాతి మ్యాచ్‌లోనూ పరాజయం... పరిస్థితి చూస్తే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) పాత జట్టులా మళ్లీ ఓటమి బాటలోకి వెళ్లి నిష్క్రమించేలా కనిపించింది. అయితే ఒక్కసారిగా చెలరేగిన ఆర్‌సీబీ ‘హ్యాట్రిక్‌’ విజయాలతో సత్తా చాటింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే వరుసగా రెండో సీజన్‌లో ‘ప్లే ఆఫ్స్‌’లోకి ప్రవేశించింది. ఉత్కంఠగా సాగిన పోరులో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి కోహ్లి సేన ముందంజ వేసింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎప్పటిలాగే ఒత్తిడికి లోనై చివర్లో విజయం చేజార్చుకున్న కింగ్స్‌ ఆట ఈ ఏడాదికి ముగిసినట్లే!

షార్జా: చెన్నై, ఢిల్లీ తర్వాత మూడో జట్టు బెంగళూరు తమ ప్లే ఆఫ్స్‌ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (33 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, దేవదత్‌ పడిక్కల్‌ (38 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (42 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు.  

అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు...
కోహ్లి (24 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌), పడిక్కల్‌ మరోసారి బెంగళూరుకు అర్ధ సెంచరీ భాగస్వామ్యం అందించారు. 9 పరుగుల వద్ద కోహ్లిని స్టంపౌట్‌ చేసే అవకాశం వదిలేసిన రాహుల్‌... అదే ఓవర్లో పడిక్కల్‌ ఇచి్చన క్యాచ్‌ను కూడా వదిలేశాడు. 10 పరుగుల వద్ద సర్ఫరాజ్‌ క్యాచ్‌ వదిలేయడంతో కోహ్లి మళ్లీ బతికిపోయాడు. అర్ష్‌దీప్‌ ఓవర్లో పడిక్కల్‌ సిక్స్, ఫోర్‌ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ స్కోరు 55 పరుగులకు చేరింది. కొద్దిసేపటికి హెన్రిక్స్‌ తన తొలి ఓవర్లోనే కోహ్లిని అవుట్‌ చేసి ఈ జోడీని విడదీయగా, తర్వాతి బంతికే క్రిస్టియాన్‌ (0) కూడా అవుటయ్యాడు.

హెన్రిక్స్‌ తన తర్వాతి ఓవర్లోనే పడిక్కల్‌ను కూడా వెనక్కి పంపించాడు. అయితే ఈ దశలో మ్యాక్స్‌వెల్‌ దూకుడైన బ్యాటింగ్‌ ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. హర్‌ప్రీత్‌ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన మ్యాక్స్‌వెల్, ఆ తర్వాత రవి బిష్ణోయ్‌ ఓవర్లోనూ మరో రెండు సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత డివిలియర్స్‌ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) జోరుతో షమీ ఓవర్లో చాలెంజర్స్‌ 17 పరుగులు రాబట్టింది. 29 బంతుల్లో మ్యాక్స్‌వెల్‌ అర్ధసెంచరీ పూర్తయింది. సర్ఫరాజ్‌ డైరెక్ట్‌ హిట్‌తో డివిలియర్స్‌ రనౌట్‌ కావడంతో 73 పరుగుల (39 బంతుల్లో) మెరుపు భాగస్వామ్యానికి తెర పడింది.   

ఓపెనర్లు మినహా...
ఓపెనర్ల మధ్య మరో భారీ భాగస్వామ్యం పంజాబ్‌కు శుభారంభాన్ని అందించినా... చివరకు అది విజయానికి మాత్రం పనికి రాలేదు. రాహుల్, మయాంక్‌ కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో ఆరు ఓవర్లో ముగిసేసరికి కింగ్స్‌ 49 పరుగులు సాధించింది. రాహుల్‌తో పోలిస్తే మయాంక్‌ కాస్త ధాటిగా ఆడాడు. క్రిస్టియాన్, చహల్‌ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతను షహబాజ్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ బాదాడు. రాహుల్‌ను షహబాజ్‌ అవుట్‌ చేసిన తర్వాత ఒక్కసారిగా పంజాబ్‌ ఛేదన కష్టంగా మారిపోయింది.

స్కోరు వివరాలు  
ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) హెన్రిక్స్‌ 25; పడిక్కల్‌ (సి) రాహుల్‌ (బి) హెన్రిక్స్‌ 40; క్రిస్టియాన్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) హెన్రిక్స్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) షమీ 57; డివిలియర్స్‌ (రనౌట్‌) 23; షహబాజ్‌ (బి) షమీ 8; శ్రీకర్‌ భరత్‌ (నాటౌట్‌) 0; గార్టన్‌ (బి) షమీ 0; హర్షల్‌ పటేల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164.  వికెట్ల పతనం: 1–68, 2–68, 3–73, 4–146, 5–157, 6–163, 7–163. బౌలింగ్‌: మార్క్‌రమ్‌ 1–0–5–0, షమీ 4–0–39–3, అర్ష్‌దీప్‌ 3–0–42–0, బిష్ణోయ్‌ 4–0–35–0, హర్‌ప్రీత్‌ 4–0–26–0, హెన్రిక్స్‌ 4–0–12–3.

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) హర్షల్‌ (బి) షహబాజ్‌ 39; మయాంక్‌ (సి) సిరాజ్‌ (బి) చహల్‌ 57; పూరన్‌ (సి) పడిక్కల్‌ (బి) చహల్‌ 3; మార్క్‌రమ్‌ (సి) క్రిస్టియాన్‌ (బి) గార్టన్‌ 20; సర్ఫరాజ్‌ (బి) చహల్‌ 0; షారుఖ్‌ (రనౌట్‌) 16; హెన్రిక్స్‌ (నాటౌట్‌) 12; హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158.  వికెట్ల పతనం: 1–91, 2–99, 3–114, 4–121, 5–127, 6–146. బౌలింగ్‌: 4–0–33–0, గార్టన్‌ 4–0–27–1, షహబాజ్‌ 3–0–29–1, హర్షల్‌ 4–0–27–0, చహల్‌ 4–0–29–3, క్రిస్టియాన్‌ 1–0–11–0.

మరిన్ని వార్తలు