ఏబీ... మళ్లీ

18 Oct, 2020 03:26 IST|Sakshi

బెంగళూరును గెలిపించిన డివిలియర్స్‌

22 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 55 నాటౌట్‌ 

బౌలింగ్‌లో మెరిసిన మోరిస్‌ (4/26)

రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆరో ఓటమి

‘మిస్టర్‌ 360’ ప్లేయర్‌ డివిలియర్స్‌ సిక్సర్ల మోత... పేసర్‌ క్రిస్‌ మోరిస్‌ వికెట్ల విన్యాసాలు... కెప్టెన్‌  కోహ్లి కూల్‌ ఇన్నింగ్స్‌... వెరసి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరో సాధికారిక విజయాన్ని కైవసం చేసుకుంది. ఒకదశలో ఓటమి తప్పదా అనిపించే స్థితిలో ఉన్న బెంగళూరును డివిలియర్స్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో గట్టెక్కించాడు. మరోవైపు బ్యాట్స్‌మెన్‌ రాణించినా, బౌలర్లు విఫలం కావడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరో ఓటమిని ఆహ్వానించింది.

దుబాయ్‌: విజయ సమీకరణం ఎంత క్లిష్టంగా ఉన్నా... క్రీజులో డివిలియర్స్‌ ఉన్నాడంటే జట్టుకు విజయంపై ఎక్కడలేని భరోసా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్‌–13లో అబ్రహామ్‌ బెంజమిన్‌ (ఏబీ) డివిలియర్స్‌ మళ్లీ విశ్వరూపం ప్రదర్శించడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మరోసారి ఓటమి బాటను వీడి విజయతీరాలను చేరుకుంది. శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (36 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప (22 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడు కనబరిచాడు. మోరిస్‌ 4 వికెట్లతో రాయల్స్‌ను కట్టడి చేయగా... చహల్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డివిలియర్స్‌ (22 బంతుల్లో 55 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్స్‌లు) మెరుపులతో బెంగళూరు 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి నెగ్గింది. దేవదత్‌ పడిక్కల్‌ (35; 2 ఫోర్లు), కెప్టెన్‌ కోహ్లి (32 బంతుల్లో 43; 1 ఫోర్, 2 సిక్స్‌లు), గురుకీరత్‌ సింగ్‌ (17 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్‌) ఆకట్టుకున్నారు.

సిక్సర్ల హోరు...
బెంగళూరు విజయ సమీకరణం చివరి 30 బంతుల్లో 64 పరుగులు. కార్తీక్‌ త్యాగి వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ మినహా మిగతా నాలుగు ఓవర్లలో కనీసం ఓ సిక్సర్‌ బాదిన డివిలియర్స్‌... 19వ ఓవర్‌లో ఉనాద్కట్‌పై రెచ్చిపోయాడు. తొలి మూడు బంతుల్లో వరుసగా మిడ్‌ వికెట్, లాంగాన్, స్క్వేర్‌ లెగ్‌లో సిక్సర్లతో విజృంభించాడు. ఐదో బంతికి గురుకీరత్‌ ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్‌లో అత్యధికంగా 25 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతిపై గురుకీరత్‌ రెండు పరుగులు, రెండో బంతికి సింగిల్‌ తీశాడు. మూడో బంతి ఎదుర్కొన్న డివిలియర్స్‌ రెండు పరుగులు తీశాడు. దాంతో బెంగళూరు విజయ సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులుగా మారింది. డివిలియర్స్‌ మరో అవకాశం ఇవ్వకుండా నాలుగో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌గా మలిచి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.

స్కోరు వివరాలు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: ఉతప్ప (సి) ఫించ్‌ (బి) చహల్‌ 41; స్టోక్స్‌ (సి) డివిలియర్స్‌ (బి) మోరిస్‌ 15; సామ్సన్‌ (సి) మోరిస్‌ (బి) చహల్‌ 9; స్మిత్‌ (సి) షాబాజ్‌ అహ్మద్‌ (బి) మోరిస్‌ 57; బట్లర్‌ (సి) సైనీ (బి) మోరిస్‌ 24; రాహుల్‌ తేవటియా (నాటౌట్‌) 19; ఆర్చర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మోరిస్‌ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1–50, 2–69, 3–69, 4–127, 5–173, 6–177.
బౌలింగ్‌: సుందర్‌ 3–0–25–0, మోరిస్‌ 4–0–26–4, ఉదాన 3–0–43–0, సైనీ 4–0–30–0, చహల్‌ 4–0–34–2, షాబాజ్‌ అహ్మద్‌ 2–0–18–0.  

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దేవదత్‌ పడిక్కల్‌ (సి) స్టోక్స్‌ (బి) తేవటియా 35; ఫించ్‌ (సి) ఉతప్ప (బి) శ్రేయస్‌ గోపాల్‌ 14; కోహ్లి (సి) తేవటియా (బి) కార్తీక్‌ త్యాగి 43; డివిలియర్స్‌ (నాటౌట్‌) 55; గురుకీరత్‌ సింగ్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 179. 
వికెట్ల పతనం: 1–23, 2–102, 3–102.
బౌలింగ్‌: ఆర్చర్‌ 3.4–0–38–0, గోపాల్‌ 4–0–32–1, కార్తీక్‌ త్యాగి 4–0–32–1, ఉనాద్కట్‌ 4–0–46–0, రాహుల్‌ తేవటియా 4–0–30–1.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు