RCB Vs RR: బెంగళూరు మరింత బలంగా...

30 Sep, 2021 05:09 IST|Sakshi

వరుసగా రెండో విజయం సాధించిన ఆర్‌సీబీ

మ్యాక్స్‌వెల్‌ అర్ధ సెంచరీ

రాణించిన శ్రీకర్‌ భరత్‌

ఏడు వికెట్లతో రాజస్తాన్‌ ఓటమి  

తొలిసారి చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టును చిత్తు చేసిన ఆర్‌సీబీ మరో సమష్టి ప్రదర్శనతో కీలక విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో చహల్, షహబాజ్‌ ప్రదర్శనకు తోడు బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్, కోన శ్రీకర్‌ భరత్‌ రాణించడంతో రాజస్తాన్‌పై అలవోక విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభారంభం అందించినా దానిని కొనసాగించలేకపోయిన రాయల్స్‌ పేలవ బౌలింగ్‌తో ఏమాత్రం పోటీనివ్వకుండా తలవంచింది.

దుబాయ్‌: ఐపీఎల్‌ రెండో దశలో రెండు పరాజయాల తర్వాత కోహ్లి సేనకు వరుసగా రెండో విజయం దక్కింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. ముందుగా రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. లూయిస్‌ (37 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, యశస్వి జైస్వాల్‌ (22 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చహల్‌ (2/18), హర్షల్‌ పటేల్‌ (3/34), షహబాజ్‌ (2/10) ఆకట్టుకున్నారు. అనంతరం ఆర్‌సీబీ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (30 బంతుల్లో 50 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కోన శ్రీకర్‌ భరత్‌ (35 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.  

ఓపెనర్లు మినహా...
తొలి వికెట్‌కు 49 బంతుల్లోనే 77 పరుగులు... 11 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 100 పరుగులు... బ్యాటింగ్‌కు చాలా బాగా సహకరిస్తున్న పిచ్‌! ఇన్ని అనుకూలతలను కూడా రాజస్తాన్‌ పూర్తిగా ఉపయోగించుకోలేకపోయింది. బెంగళూరు కట్టుదిట్టమైన బౌలింగ్, తమ స్వయంకృతం కలగలిసి రా యల్స్‌ చివరకు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు మినహా తర్వాతి బ్యాట్స్‌మెన్‌ పేలవ షాట్లకు వెనుదిరగడంతో ఇన్నింగ్స్‌ కుప్పకూలింది.

రాణించిన భరత్‌...
ఛేజింగ్‌లో మోరిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి కోహ్లి (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఛేదనను జోరుగా మొదలు పెట్టాడు. మరో ఎండ్‌లో కూడా వేగంగా ఆడిన పడిక్కల్‌ (17 బంతుల్లో 22; 4 ఫోర్లు) ను ముస్తఫిజుర్‌ అవుట్‌ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాతి ఓవ ర్లో కోహ్లి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో ఆంధ్ర క్రికెటర్‌ భరత్, మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌ కు 55 బంతుల్లో 69 పరుగులు జోడించాక భరత్‌ వెనుదిరిగాడు. ఈ దశలో బెంగళూరు విజయం కోసం 24 బంతుల్లో 23 పరుగులు కావాల్సి ఉండగా 7 బంతు ల్లోనే ఆట ముగిసింది! మోరి స్‌ వేసిన 17వ ఓవర్లో మ్యాక్స్‌ వెల్‌ (6, 2, 4, 2, 4, 4) 22 పరుగులు రాబట్టగా... పరాగ్‌ వేసిన తర్వాతి ఓవర్‌ తొలి బంతిని డివిలియర్స్‌ (4 నాటౌట్‌) ఫోర్‌ బాది గెలిపించాడు.
   
స్కోరు వివరాలు  
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: లూయిస్‌ (సి) భరత్‌ (బి) గార్టన్‌ 58; యశస్వి (సి) సిరాజ్‌ (బి) క్రిస్టియాన్‌ 31; సామ్సన్‌ (సి) పడిక్కల్‌ (బి) షహబాజ్‌ 19; లోమ్రోర్‌ (స్టంప్డ్‌) భరత్‌ (బి) చహల్‌ 3; లివింగ్‌స్టోన్‌ (సి) డివిలియర్స్‌ (బి) చహల్‌ 6; తెవాటియా (సి) పడిక్కల్‌ (బి) షహబాజ్‌ 2; పరాగ్‌ (సి) కోహ్లి (బి) హర్షల్‌ 9; మోరిస్‌ (సి) పడిక్కల్‌ (బి) హర్షల్‌ 14; సకారియా (సి) డివిలియర్స్‌ (బి) హర్షల్‌ 2; త్యాగి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–77, 2–100, 3–113, 4–113, 5–117, 6–127, 7–146, 8–146, 9–149. బౌలింగ్‌: గార్టన్‌ 3–0–30–1, సిరాజ్‌ 3–0–18–0, మ్యాక్స్‌వెల్‌ 2–0–17–0, హర్షల్‌ 4–0–34–3, క్రిస్టియాన్‌ 2–0–21–1, చహల్‌ 4–0–18–2, షహబాజ్‌ 2–0–10–2.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (రనౌట్‌) 25; పడిక్కల్‌ (బి) ముస్తఫిజుర్‌ 22; భరత్‌ (సి) (సబ్‌) రావత్‌ (బి) ముస్తఫిజుర్‌ 44; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 50; డివిలియర్స్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–48, 2–58, 3–127. బౌలింగ్‌: మోరిస్‌ 4–0–50–0, త్యాగి 2–0–23–0, సకారియా 3–0–18–0, ముస్తఫిజుర్‌ 3–0–20–2, తెవాటియా 3–0–23–0, లోమ్రోర్‌ 2–0–13–0, పరాగ్‌ 0.1–0–4–0.
 

>
మరిన్ని వార్తలు