మళ్లీ ‘సూపర్‌’... బెంగళూరు విన్నర్‌ 

29 Sep, 2020 02:58 IST|Sakshi

సూపర్‌ ఓవర్‌లో నెగ్గిన ఆర్‌సీబీ

రాణించిన ఫించ్, డివిలియర్స్, దేవ్‌దత్‌

కిషన్, పొలార్డ్‌ సిక్సర్లు వృథా

దుబాయ్‌: మళ్లీ సిక్స్‌లే సిక్స్‌లు! వరదే వరద!! బౌండరీ లైనే చేరువైందో లేక బౌలింగే తేలిపోయిందో తెలీదు కానీ మెరుపులు అతి సులువవుతున్నాయి. పొదుపు బౌలింగ్‌ గగనమవుతోంది. గెలుపు ఖాయమనే అంచనాలు ఆఖరి బంతిదాకా మారుతూనే ఉన్నాయి. అలాంటి మ్యాచ్‌ ఐపీఎల్‌లో సోమవారం జరిగింది. క్రికెట్‌ అభిమానుల్ని తెగ అలరించిన ఈ మ్యాచ్‌లో చివరకు సూపర్‌ ఓవరే ఫలితాన్నిచ్చింది. 201 పరుగులు చేసినా దక్కని విజయం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు (ఆర్‌సీబీ) ఆ ఒక్క సూపర్‌ ఓవర్‌తో దక్కింది. ముంబై ఇండియన్స్‌ పోరాటం ఆ ఓవర్‌లోనే ఆవిరైంది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డివిలియర్స్‌ (24 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫించ్‌ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 201 పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘టై’ అయ్యింది. ఇషాన్‌ కిషన్‌ (58 బంతుల్లో 99; 2 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీకి దూరమైనా భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. పొలార్డ్‌ (24 బంతుల్లో 60 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) వణికించాడు.

ముంబైకి కష్టాలు... 
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు రోహిత్‌ 6, డికాక్‌ 4 బాదడంతో 14 పరుగులు వచ్చాయి. ఇక ఆరంభం అదిరిందిలే అనుకుంటుండగా వరుస ఓవర్లలో రోహిత్‌ శర్మ (8)ను సుందర్, సూర్యకుమార్‌ (0)ను ఉదాన అవుట్‌ చేయడం ముంబైని కష్టాల్లోకి నెట్టింది. దీన్నుంచి తేరుకోకముందే మరో ఓపెనర్‌ డికాక్‌ (14)ను చహల్‌ ఔట్‌ చేశాడు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ ఆ తర్వాత మ్యాచ్‌ సాగేకొద్దీ లక్ష్యానికి దూరమైంది. జట్టు స్కోరు 50 చేరేందుకే 7.5 ఓవర్లు ఆడింది. 14 ఓవర్లు ముగిసినా వందనే చేరలేదు. 98/4 స్కోరు చేయగా... ఇక మిగిలిన 6 ఓవర్లలో 103 పరుగులు కావాలి. దాదాపు కష్టసాధ్యం. క్రీజులో ఉన్న పొలార్డ్‌ కూడా అప్పటిదాకా పెద్దగా మెరిపించలేదు.  

సిక్సర్ల ధమాకా.... 
ఇలాంటి స్థితిలో 17వ ఓవర్‌ ముంబై దశనే మార్చింది. 2 క్యాచ్‌లు నేలపాలు కావడంతో పొలార్డ్‌ ఓవర్‌ అసాంతం చితగ్గొట్టాడు. 4, 6, 6, 2, 6, 3లతో మొత్తం 27 పరుగులు రావడంతో జట్టు స్కోరు అనూహ్యంగా 149/4కు చేరింది. గత మ్యాచ్‌ (పంజాబ్, రాజస్తాన్‌) అనుభవం దృష్ట్యా ఇక 18 బంతుల్లో 53 పరుగులు కష్టంగా కనిపించలేదు. చహల్‌ 18వ ఓవర్లో 3 భారీ సిక్సర్లు బాదిన పొలార్డ్‌ 20 బంతుల్లోనే (2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. చహల్‌ కూడా 20 పైచిలుకు (22 పరుగులు) ఇవ్వడంతో ముంబై లక్ష్యానికి (12 బంతుల్లో 31 పరుగులు) దగ్గరైంది. 19వ ఓవర్‌లో నవదీప్‌ సైనీ 12 పరుగులిచ్చాడు. ముంబై ఆఖరి 6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా ఉదాన వేసిన ఈ ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ 2 సిక్సర్లు కొట్టి ఔట్‌కాగా... ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే పొలార్డ్‌ ఫోర్‌ కొట్టడంతో స్కోరు 201తో సమమైంది. మ్యాచ్‌ ‘టై’ అయింది. విజేత కోసం సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది.    

ఓపెనర్ల ఫిఫ్టీ–ఫిఫ్టీ... 
అంతకుముందు ముంబై బౌలర్లపై బెంగళూరు ఓపెనర్లు ఫించ్, దేవ్‌దత్‌ విరుచుకపడి ఫోర్లతో స్కోరు బోర్డును పరిగెత్తించారు. వీరిద్దరు అవుటయ్యాక విలియర్స్‌ వీరవిహారం చేశాడు. దాంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. 

బెంగళూరు సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ పవన్‌ నేగి ఈ మ్యాచ్‌లో చక్కని క్యాచ్‌లతో ముగ్గురిని (రోహిత్, డికాక్, హార్దిక్‌) పెవిలియన్‌ పంపాడు. ఇవన్నీ కూడా బెంగళూరును మ్యాచ్‌లో నిలబెట్టాయి. పైగా పెద్ద లక్ష్యమే కావడంతో ఆర్‌సీబీ విజయం దాదాపు ఖాయమైన తరుణంలో గొప్ప మలుపు తీసుకుంది. జంపా వేసిన 17వ ఓవర్లో పొలార్డ్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను బౌండరీలైన్‌ వద్ద పవన్‌ నేగి నేలపాలు చేశాడు. అది కాస్తా లైన్‌ వెలుపల పడటంతో సిక్సర్‌ అయ్యింది. అదే ఓవర్లో చహల్‌ మరో క్యాచ్‌ చేజార్చాడు. దీంతో పాటు ఆ ఓవర్లో 27 పరుగులు రావడంతో ముంబై రేసులోకి వచ్చింది.  

కోహ్లి మళ్లీ... 
కోహ్లి (3) వరుసగా మళ్లీ విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతను 14, 1, 3 స్కోర్లతో నిరాశపరిచాడు. చిత్రమేమిటంటే యూఏఈ గడ్డపై ఇప్పటిదాకా ఈ స్టార్‌ క్రికెటర్‌ బ్యాట్‌ నుంచి ఒక్క బౌండరీ కూడా వెళ్లలేదు.

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దేవ్‌దత్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 54; ఫించ్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 52; కోహ్లి (సి) రోహిత్‌ శర్మ (బి) రాహుల్‌ చహర్‌ 3; డివిలియర్స్‌ (నాటౌట్‌) 55; శివమ్‌ దూబే (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201. 
వికెట్ల పతనం: 1–81, 2–92, 3–154.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–34–2, ప్యాటిన్సన్‌ 4–0–51–0, చహర్‌ 4–0–31–1, బుమ్రా 4–0–42–0, కృనాల్‌ 3–0–23–0, పొలార్డ్‌ 1–0–13–0. 

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) (సబ్‌) పవన్‌ నేగి (బి) సుందర్‌ 8; డికాక్‌ (సి) (సబ్‌) పవన్‌ నేగి (బి) చహల్‌ 14; సూర్యకుమార్‌  (సి) డివిలియర్స్‌ (బి) ఉదాన 0; ఇషాన్‌ కిషన్‌ (సి) దేవదత్‌ (బి) ఉదాన 99; హార్దిక్‌ (సి) (సబ్‌) పవన్‌ నేగి (బి) జంపా 15; పొలార్డ్‌ (నాటౌట్‌) 60; కృనాల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. 
వికెట్ల పతనం: 1–14, 2–16, 3–39, 4–78, 5–197.
బౌలింగ్‌: ఇసురు ఉదాన 4–0–45–2, వాషింగ్టన్‌ సుందర్‌ 4–0–12–1, నవదీప్‌ సైనీ 4–0–43–0, యజువేంద్ర చహల్‌ 4–0–48–1, ఆడమ్‌ జంపా 4–0–53–1. 

మరిన్ని వార్తలు