Jos Buttler: పరుగులే కాదు.. ప్రైజ్‌మనీ విషయంలోనూ చరిత్ర సృష్టించాడు

31 May, 2022 16:36 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్‌‌ 15వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జాస్‌ బట్లర్‌ నిలిచాడు.17 మ్యాచ్‌ల్లో 863 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన బట్లర్‌.. ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. అంతేకాదు బట్లర్‌ ఈ సీజన్‌లో నాలుగు సెంచరీతో దుమ్మురేపాడు. రాజస్తాన్‌ రాయల్స్‌కు బట్లర్‌ బ్యాటింగే ప్రధాన బలం అని చెప్పొచ్చు. అయితే బట్లర్‌ పరుగుల విషయంలోనే కాదు.. ప్రైజ్‌మనీ అందుకోవడంలోనూ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌‌ మొత్తంలో ఏకంగా 37 అవార్డులు అందుకున్న బట్లర్‌‌ వాటిద్వారా  రూ.95 లక్షల ప్రైజ్‌‌మనీ ఖాతాలో వేసుకొని ఔరా అనిపించాడు. 


PC: IPL Twitter
ఐపీఎల్‌ 15వ సీజన్‌‌ అవార్డుల్లో ఆరెంజ్‌‌ క్యాప్‌‌, మోస్ట్ వాల్యుబుల్‌‌, గేమ్‌‌ చేంజర్‌‌, మ్యాగ్జిమమ్‌‌ ఫోర్స్‌‌, మ్యాగ్జిమమ్‌‌ సిక్సెస్‌‌, పవర్‌‌ ప్లేయర్‌‌ పురస్కారాలతో రూ. 60 లక్షలు గెలుచుకున్నాడు. లీగ్ స్టేజ్‌‌లో రెండుసార్లు, క్వాలిఫయర్–2లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‌ అందుకున్న బట్లర్ వీటి ద్వారా రూ. 7లక్షలు సాధించాడు. వివిధ  మ్యాచ్‌‌ల్లో పవర్ ప్లేయర్,  గేమ్ చేంజర్,  మోస్ట్ ఫోర్స్,  మోస్ట్‌‌ సిక్సెస్‌‌, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌‌, సూపర్ స్ట్రైకర్‌‌ అవార్డులతో మరో 28 లక్షలు  కైవసం చేసుకున్నాడు. కాగా రాజస్థాన్‌ బట్లర్‌ను రూ. 10 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

రాజస్తాన్‌ ఫైనల్‌ చేరిందంటే అదంతా బట్లర్‌ చలువే. ఫైనల్లో బట్లర్‌ 39 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వడం.. ఆ తర్వాత ప్రధాన బ్యాటర్లంతా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైన రాజస్తాన్‌ రాయల్స్‌.. గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 

చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి'

మరిన్ని వార్తలు