క్రీడా బడ్జెట్‌లో రూ. 230 కోట్లు కోత

2 Feb, 2021 01:08 IST|Sakshi

క్రీడా బడ్జెట్‌ను రూ. 2596.14 కోట్లతో సరిపెట్టిన కేంద్రం

‘ఖేలో ఇండియా’ నిధుల్లోనూ కత్తెర

‘సాయ్‌’, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు పెరిగిన ప్రాధాన్యం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ క్రీడా రంగం కుదేలైన వేళ బడ్జెట్‌లో క్రీడల ప్రాధాన్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తగ్గించారు. సోమవారం 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆమె క్రీడా బడ్జెట్‌లో రూ. 230.78 కోట్లు కోత విధిం చారు. గతేడాది క్రీడల కోసం రూ. 2826.92 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ మొత్తాన్ని రూ. 2596.14కోట్లతో సరిపెట్టారు.  

► మరోవైపు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి సైతం బడ్జెట్‌లో ప్రాధాన్యం భారీగా తగ్గింది. గతేడాది రూ. 890.42 కోట్లుగా ఉన్న ఈ మొత్తాన్ని ఈ ఏడాదికి గానూ రూ. 657.71 కోట్లకు కుదించారు. దీంతో ఏకంగా రూ. 232.71 కోట్లపై కోత పడింది.  
 

► అయితే జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను, క్రీడాకారులను, సంస్థలను పర్యవేక్షించే స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)తోపాటు నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌లకు (ఎన్‌ఎస్‌ఎఫ్‌) కేంద్రం సముచిత ప్రాధాన్యాన్నిచ్చింది. బడ్జెట్‌ కేటాయింపులో గతేడాదితో పోలిస్తే భారీ పెంపును ప్రకటించింది. దీంతో ‘సాయ్‌’ నిధులు రూ. 500 కోట్లు నుంచి రూ. 660.41 కోట్లకు చేరగా... సమాఖ్యల బడ్జెట్‌ రూ. 245 కోట్లు నుంచి ఏకంగా రూ. 280 కోట్లకు పెరిగింది.  

► క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకాలను రూ. 70 కోట్ల నుంచి రూ. 53 కోట్లకు తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్‌లో ప్రతిపాదించారు.  

► జాతీయ క్రీడాభివృద్ధి నిధుల్లోనూ కత్తెర వేశారు. సగానికి సగం తగ్గించి ఈ మొత్తాన్ని రూ. 25 కోట్లుగా నిర్ధారించారు.  

► కామన్వెల్త్‌ క్రీడల సన్నాహాల బడ్జెట్‌ను రూ. 75 కోట్లు నుంచి రూ. 30 కోట్లకు తగ్గించిన కేంద్రం... జమ్ము కశ్మీర్‌లో క్రీడా సదుపాయాల కల్పన నిధులు (రూ. 50 కోట్లు), జాతీయ క్రీడాకారుల సంక్షేమానికి కేటాయించే నిధుల్లో (రూ. 2 కోట్లు) ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదు.  

► గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి జాతీయ వ్యాయామ విద్య సంస్థ బడ్జెట్‌ను యథాతథంగా రూ. 55 కోట్లుగా కొనసాగించింది. ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థకు కేటాయించే నిధుల్ని రూ. 2 కోట్లు నుంచి రూ. 2.5 కోట్లకు పెంచింది.

మరిన్ని వార్తలు