Road Safety World Series 2022: ఆ ఒక్క సిక్స్‌తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు

23 Sep, 2022 12:16 IST|Sakshi

టీమిండియా దిగ్గజం.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సచిన్‌ బ్యాటింగ్‌ జోరును ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 ఏళ్ల వయసులో  భారీ షాట్లతో విరుచుకుపడి అభిమానులకు వింటేజ్‌ సచిన్‌ను గుర్తుచేశాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

తాజాగా ఈ మ్యాచ్‌లో సచిన్‌ కొట్టిన మూడు సిక్సర్లు వేటికవే స్పెషల్‌ అని చెప్పొచ్చు. అయితే క్రిస్‌ ట్రెమ్లెట్‌ బౌలింగ్‌లో అతను కొట్టిన ఒక సిక్స్‌ మాత్రం 1998 షార్జాను గుర్తుచేసింది. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ తుఫాను ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ను అభిమానులు ముద్దగా ''Desert Strome'' అని పిలుచుకున్నారు. ఆ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సచిన్‌ కళ్లు చెదిరే సిక్సర్లతో మెరిశాడు.

అందులో ఫ్రంట్‌పుట్‌ వచ్చి స్ట్రెయిట్‌ సిక్సర్‌ బాదడం అప్పట్లో ఒక ట్రేడ్‌మార్క్‌గా నిలిచిపోయింది. ఇలాంటి షాట్లు సచిన్‌ కొడుతుంటే అభిమానులు ఉర్రూతలూగిపోయేవాళ్లు. ట్రెమ్లెట్‌ బౌలింగ్‌లో 6,6,4 బాదిన సచిన్‌..  ఆ ఓవర్‌లో మొత్తంగా 16 పరుగులు పిండుకున్నాడు. ఇక సచిన్‌ షార్జా 1998 గుర్తుచేస్తూ.. ఫ్రంట్‌ఫుట్‌ వచ్చి స్ట్రెయిట్‌ సిక్స్‌ కొట్టాడు. దీంతో అభిమానులు 1998 షార్జా, ప్రస్తుతం సచిన్‌ కొట్టిన సిక్సర్లను ఒకే ఫ్రేమ్‌లో జోడించి ట్వీట్స్‌ చేశారు. ''సచిన్‌ సిక్సర్లు చూస్తుంటే మనం 1998లో ఉన్నామా''.. ''వింటేజ్‌ సచిన్‌ను తలపిస్తున్నాడు'' అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ 40 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 15 ఓవర్లకు కుదించారు. సచిన్‌ మెరుపులకు యువరాజ్‌ విధ్వంసం తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా లెజెండ్స్‌ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ 15 ఓవర్లలో  ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.

చదవండి: ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్‌ అవుతున్న ఇంటర్నెట్‌

సచిన్‌ క్లాస్‌..యువీ మాస్‌; ఇండియా లెజెండ్స్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు