రుద్రాంక్ష్ పసిడి గురి 

22 Feb, 2023 05:27 IST|Sakshi

కైరో (ఈజిప్ట్‌): ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం భారత్‌ ఖాతాలో ఒక స్వర్ణం, ఒక కాంస్యం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్  బాలాసాహెబ్‌ పాటిల్‌ పసిడి పతకం సాధించగా... మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో తిలోత్తమ సేన్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది.

ఫైనల్లో రుద్రాంక్ష్  16–8తో మాక్సిమిలన్‌ ఉల్‌బ్రిచ్‌ (జర్మనీ)పై గెలిచాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ర్యాంకింగ్‌ రౌండ్‌లో రుద్రాంక్ష్  262 పాయింట్లు, ఉల్‌బ్రిచ్‌ 260.6 పాయింట్లు స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించారు. మిరాన్‌ మారిసిచ్‌  (క్రొయేషియా; 260.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు.

74 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రుద్రాంక్ష్  629.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ర్యాంకింగ్‌ రౌండ్‌కు చేరాడు. టాప్‌–8లో నిలిచిన షూటర్లు ర్యాంకింగ్‌ రౌండ్‌లో పోటీపడతారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో తిలోత్తమ సేన్‌ 262 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. ప్రస్తుతం భారత్‌ 3 స్వర్ణాలు, 2 కాంస్యాలతో కలిపి ఐదు పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో ఉంది.   
 

మరిన్ని వార్తలు