ICC New Rules: అక్టోబర్‌ ఒకటి నుంచి కొత్త రూల్స్‌.. టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా

20 Sep, 2022 12:40 IST|Sakshi

క్రికెట్‌లో అక్టోబర్‌ ఒకటి నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ లాంటి మేజర్‌ టోర్నీలో ఈ రూల్స్‌ తొలిసారి అమలు కానున్నాయి. క్రికెట్‌లో చట్టాలు చేసే మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) గత మార్చిలోనే మన్కడింగ్‌ సహా పలు అంశాలపై నూతన చట్ట సవరణలు తీసుకొచ్చింది. వీటికి ఐసీసీ కూడా గతంలోనే ఆమోద ముద్ర వేసింది. అయితే అక్టోబర్‌ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తామని ఐసీసీ పేర్కొంది.

కాగా మన్కడింగ్‌ అనే పదం ఇక క్రికెట్‌లో చట్టబద్ధం అని ఎంసీసీ పేర్కొన్న సంగతి తెలిసిందే.  బౌలింగ్‌ వేసే సమయంలో బంతి బౌలర్‌ చేతి నుంచి విడుదల కాకముందే నాన్‌స్ట్రయిక్‌ బ్యాటర్‌ పరుగు పెడితే బౌలర్‌ వికెట్లను గిరాటేయడమే మన్కడింగ్‌. ఐపీఎల్‌లో బట్లర్‌ను అశ్విన్‌ ఇలా అవుట్‌ చేస్తే పాశ్చత్య క్రికెటర్లు అతనిపై ధ్వజమెత్తారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని నానాయాగీ చేశారు. క్రికెట్‌ చట్టాలు చేసే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్‌లో రనౌట్‌! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్‌ కాదని పేర్కొంది. 

అక్టోబర్‌ ఒకటి నుంచి అమలు కానున్న రూల్స్‌ ఇవే..
ఉమ్మిపై నిషేధం
►బంతిని మెరిసేలా చేసేందుకు బౌల‌ర్లు ఉమ్మి రాయడం తెలిసిందే. అయితే ఇటీవ‌ల కోవిడ్ వ‌ల్ల బంతికి ఉమ్మిరాయ రాదు అని ఓ నిషేధాన్ని విధించారు. తాత్కాలికంగా రెండేళ్ల పాటు ఆ నిషేధం కొన‌సాగింది. అయితే ఇప్పుడు ఆ నిషేధాన్ని ప‌ర్మినెంట్ చేసేశారు. ఉమ్మి బదులుగా ఇటీవ‌ల ప్లేయ‌ర్లు.. చెమ‌టతో బంతిని మెరిసేలా చేస్తున్నారు. ఆ ఫార్ములా వ‌ర్కౌట్ అయిన‌ట్లు తెలుస్తోంది.

►క్యాచ్‌ అవుట్‌ అయిన బ్యాటర్‌ సగం పిచ్‌ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్‌ చేయాలి. ఓవర్‌ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్‌ దాటిన నెపంతో నాన్‌ స్ట్రయికర్‌ బ్యాటింగ్‌ చేయడానికి వీలులేదు.
►ఫీల్డింగ్‌ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్‌ భారీషాట్‌ ఆడినపుడు బ్యాటింగ్‌ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్‌ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్‌ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్‌) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. 

చదవండి: T20 World Cup 2022: టి20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన కివీస్‌

అర్ష్‌దీప్‌పై రోహిత్‌ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! 

మరిన్ని వార్తలు