IPL 2022: ఐపీఎల్‌ 2022కు ఉగ్రదాడి ముప్పు..?!

24 Mar, 2022 21:05 IST|Sakshi

ఐపీఎల్‌ 2022కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఐపీఎల్‌ 15వ సీజన్‌కు తెర లేననున్న సమయంలో ఈ వార్త కాస్త ఆందోళన కలిగించింది. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది సీజన్‌ను ముంబై, పూణేల్లోనే నిర్వహించాలని లీగ్‌ నిర్వాహకులు భావించారు. అందుకు అనుగుణంగానే వాంఖడే, డీవై పాటిల్‌, బ్రబౌర్న్‌ స్టేడియాల్లో లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.


వాంఖడే స్టేడియాన్ని పరిశీలిస్తున్న ఆదిత్యా ఠాక్రే

కాగా ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ను టార్గెట్‌ చేస్తూ ఉగ్రవాదులు బాంబు దాడులకు దిగనున్నట్లు గురువారం వార్తలు వచ్చాయి. ఉగ్రదాడి ముప్పు ఉందని క్విక్ రెస్పాన్స్‌ బాంబ్‌ స్వ్కాడ్‌ టీమ్‌ ఇచ్చిన హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతేగాక కొందరు ఉగ్రవాదులు మారువేశంలో మ్యాచ్‌లు జరగనున్న స్టేడియాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు మహారాష్ట్ర రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ తమ బలగాలతో మార్చి 26 నుంచి మే 22 వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను అధికారులు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐతో పాటు ఐపీఎల్‌ నిర్వాహకులుకు సమాచారం అందించారు. ఇక మార్చి 26న సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 15వ సీజన్‌కు తెరలేవనుంది. కాగా ఈసారి ఐపీఎల్‌ సీజన్‌కు 25 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు.

ఉగ్రదాడి ముప్పు నేపథ్యంలో అధికారులు విడుదల చేయనున్న గైడ్‌లైన్స్‌లోని కొన్ని ముఖ్య విషయాలు..
►ఐపీఎల్‌లో జట్లను తరలించే బస్సులకు ప్రత్యేక భద్రత కల్పిస్తూ కంబాట్‌ వాహనాలు ఎస్కార్ట్‌గా వెళ్లనున్నాయి.
►ఆటగాళ్లు ఉండనున్న హోటల్స్‌ ముందు కఠినమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు స్టేడియం నుంచి హోటల్‌ పరిసరాల వరకు ఎలాంటి కార్లను పార్క్‌ చేయడానికి వీల్లేదు. ►ప్లేయర్లను సురక్షితంగా తరలించాడానికి వారికంటూ ప్రత్యేక ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
►ఆటగాళ్లను స్టేడియాలకు, హోటల్‌ రూంకు తరలించే బస్‌ డ్రైవర్లతో పాటు మిగతా సిబ్బందిని రోజువారిగా చెక్‌ చేస్తారు. ఐపీఎల్‌ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లడానికి వీలేదు.
►ఎవరైనా ఆటగాడు తమకు తెలిసిన వ్యక్తిని కలవాలనుకుంటే కచ్చితంగా జట్టు మేనేజర్‌ అనుమతి తీసుకోవాల్సిందే.
►సరైన ఐడెంటిటీ ప్రూఫ్‌ లేకుండా హోటల్‌ స్టాఫ్‌ను ఆటగాళ్ల వద్దకు అనుమతించరు.

కాగా ఐపీఎల్‌ 2022కు ఉగ్రదాడి ముప్పు ఉందన్న వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. ఇంటలిజెన్స్‌ నుంచి మాకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. ఆ వార్తల్లో నిజమెంత అనేది తేలుస్తామని.. ముందు జాగ్రత్త చర్యగా స్టేడియం, ఆటగాళ్లు ఉండనున్న హోటల్స్‌ పరిసరాల్లో భద్రత పెంచనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. 

చదవండి: MS Dhoni: ధోని ఎందుకీ నిర్ణయం.. కెప్టెన్‌గా ముగిస్తే బాగుండేది!

IPL 2022: ఐపీఎల్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు