Russia-Ukraine Crisis: దేశం కోసం కీలక మ్యాచ్‌ను వదిలేసుకున్న టెన్నిస్‌ స్టార్‌

1 Mar, 2022 14:00 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దుందుడుకు వైఖరిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన క్రీడాకారులు తమ దేశంపై రష్యా జరుపుతున్న అమానుష దాడిని వ్యతిరేకిస్తూ పలు విధాలుగా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందని ఫుట్‌బాలర్స్‌ తాము ఆడుతున్న మ్యాచ్‌ల్లో దేశానికి తమ వంతు మద్దతు తెలుపుతూ అభిమానుల మనసులు చూరగొంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరసిస్తూ.. ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ గత శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ క్రీడల్లో రష్యా, బెలారస్‌కు చెందిన జాతీయ జెండాలను ప్రదర్శన చేయొద్దని కోరింది. ఇక దీనికి అదనంగా జాతీయ గీతం, సింబల్స్‌, కలర్స్‌ను కూడా ఎక్కడా వాడకూడదంటూ ఐవోసీ అధికారి సోమవారం ప్రకటన విడుదల చేశారు.

తాజాగా ఐవోసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉక్రెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ ఎలినా విటోలినా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా వైఖరిని ఎండగడుతూ.. మాంటేరీ ఓపెన్‌లో ఆ దేశానికి చెందిన టెన్నిస్‌ ప్లుయర్‌ అనస్థీషియా పోటాపోవాతో రౌండ్‌ ఆఫ్‌ 32 మ్యాచ్‌ ఆడేది లేదంటూ పేర్కొంది.ఈ విషయాన్ని ట్విటర్‌లో సుధీర్ఘంగా రాసుకొచ్చింది. ''డియర్‌ ఆల్‌.. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్‌ తరపున ఏటీపీ, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్‌ ఆర్గనైజేషన్‌లకు విజ్ఞప్తి చేస్తున్నా. ఐవోసీ పేర్కొన్న నిబంధనల ప్రకారం రష్యా, బెలారస్‌కు చెందిన అథ్లెట్లను మాములుగా పరిగణించండి. ఆ దేశం తరపున ఎలాంటి జాతీయ జెండాలు, సింబల్స్‌, కలర్స్‌, జాతీయ గీతాలు ప్రదర్శన చేయకూడదు.

ఇందులో భాగంగానే మాంటేరీ ఓపెన్‌లో రష్యా క్రీడాకారిణితో జరగనున్న మ్యాచ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా. సదరు ఆర్గనైజేషన్స్‌ తమ వైఖరిని తెలిపే వరకు రష్యాతో ఎలాంటి మ్యాచ్‌ ఆడదలచుకోలేదు. అయితే రష్యన్‌ అథ్లెట్స్‌ను అవమానించడం ఎంతమాత్రం కాదు. మా దేశంపై దాడి చేయడంలో రష్యా ఆటగాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీడాకారులందరూ మద్దతుగా నిలవాల్సినవ అవసరం ఉంది. ముఖ్యంగా రష్యా, బెలారస్‌కు చెందిన ఆటగాళ్లు ముందు నిలబడాల్సిన అవసరం ఉంది.'' అంటూ పేర్కొంది.  

చదవండి: Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్‌.. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నుంచి బహిష్కరణ

Rohit Sharma-Saba Karim: కెప్టెన్‌గా ఓకే రోహిత్‌.. మరి బ్యాటింగ్‌ సంగతి ఏంటి ?: భారత మాజీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు