INDA VS NZA 3rd Test: శతక్కొట్టిన రుతురాజ్‌

15 Sep, 2022 16:22 IST|Sakshi

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌-ఏతో ఇవాళ (సెప్టెంబర్‌ 15) ప్రారంభమైన మూడో అనధికర టెస్ట్‌ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. 75 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత శతకంతో (127 బంతుల్లో 108; 12 ఫోర్లు, సిక్సర్లు)  మెరిశాడు.  ఓపెనర్‌ ప్రియాంక్‌ పంచల్‌ (5), స్టార్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (0) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (38), రజత్‌ పాటిదార్‌ (30) పర్వాలేదనిపించారు. 

వికెట్‌ కీపర్‌ ఉపేంద్ర యాదవ్‌ (69) అజేయమైన అర్ధసెంచరీతో రాణించాడు. ఉపేంద్ర యాదవ్‌కు జతగా శార్ధూల్‌ ఠాకూర్‌ క్రీజ్‌లో ఉన్నాడు. కివీస్‌-ఏ బౌలర్లలో మాథ్యూ ఫిషర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. సీన్‌ సోలియా, జో వాకర్‌ తలో వికెట్‌ సాధించాడు. కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇదివరకే జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ మ్యాచ్‌ అనంతరం కివీస్‌-ఏ భారత్‌-ఏ జట్ల మధ్య  మూడు అనధికార వన్డే మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. సెప్టెంబర్‌ 22, 25, 27 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరుగనున్నాయి.   

మరిన్ని వార్తలు