Ruturaj Gaikwad: 4 సెంచరీలు... 603 పరుగులు... సంచలన ఇన్నింగ్స్‌.. అయినా పాపం!

16 Dec, 2021 11:54 IST|Sakshi

Ruturaj Gaikwad: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌. వరుస సెంచరీలతో రికార్డు సృష్టించి దిగ్గజాల సరసన చేరాడు. ఈ టోర్నీలో మొత్తంగా ఐదు ఇన్నింగ్స్‌లో 603 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. సారథిగా కూడా మంచి మార్కులే కొట్టేసినా.. జట్టును ఫైనల్‌ వరకు చేర్చలేకపోయాడు. ఐదింట నాలుగు విజయాలు సాధించినప్పటికీ... రన్‌రేటు తక్కువగా ఉన్న కారణంగా ఎలైట్‌ గ్రూపు డీలో మూడో స్థానానికే పరిమితమైంది మహారాష్ట్ర. దీంతో... నాకౌట్‌ దశకు చేరుకుండానే నిష్క్రమించింది. ఈ విషయంపై స్పందించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ విచారం వ్యక్తం చేశాడు. 

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘నాకౌట్‌ దశకు క్వాలిఫై కూడా కాకపోవడం తీవ్రంగా బాధించింది. ఐదింట నాలుగు మ్యాచ్‌లలో గెలిచాం. మిగతా గ్రూపులలో ఐదింట మూడు మాత్రమే గెలిచిన జట్లు (హిమాచల్‌, విదర్భ, తమిళనాడు, కర్ణాటక) కూడా తదుపరి రౌండ్‌కు చేరుకున్నాయి’’ అని రుతు పేర్కొన్నాడు. అదే విధంగా కేరళ చేతిలో ఓటమి గురించి చెబుతూ... ‘‘క్రికెట్‌లో ఇలాంటివి సహజం. కేరళ బ్యాటర్లు చాలా బాగా ఆడారు.

ఏడో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేశారు. వారికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. రన్‌రేటు పరంగా మేము వెనుకబడ్డాం. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ ఎంచుకోవాల్సింది. కానీ అలా జరగలేదు. దురదృష్టవశాత్తూ కొన్నిసార్లు ఇలాంటి జరుగుతూ ఉంటాయి’’ అని రుతురాజ్‌ పేర్కొన్నాడు. ఇక తన సూపర్‌ ఫామ్‌ గురించి మాట్లాడుతూ... ‘‘ఇందులో సీక్రెట్‌ ఏమీ లేదు. కేవలం ఆటపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నాను’’ అని నవ్వులు చిందించాడు.  

చదవండి: కోహ్లికే కాదు.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కపిల్‌దేవ్‌ సంచలన వాఖ్యలు

మరిన్ని వార్తలు