Who is Utkarsha Pawar?: ప్రేమ పెళ్లి చేసుకోనున్న రుతు? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే!

31 May, 2023 21:15 IST|Sakshi

Ruturaj Gaikwad's fiance- Who is Utkarsha Pawar?: టీమిండియా బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. జూన్‌ 3న అతడి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన ఈ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023కి స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

త్వరలోనే వివాహం.. అందుకే
అయితే, ఆఖరి నిమిషంలో తాను తప్పుకోనున్నట్లు రుతురాజ్‌ బీసీసీఐకి తెలిపినట్లు వార్తలు వినిపించాయి. తన వివాహం కారణంగా లండన్‌కు ఆలస్యంగా వెళ్తానని చెప్పినట్లు సమాచారం. అయితే, ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రిస్క్‌ తీసుకోలేమని భావించిన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సూచన మేరకు రుతు స్థానంలో యశస్వి జైశ్వాల్‌ను లండన్‌కు పంపారు సెలక్టర్లు.

ఇప్పటికే అతడు అక్కడ ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టేశాడు. ఇదిలా ఉంటే.. రుతురాజ్‌ పెళ్లి వార్తల నేపథ్యంలో వధువు ఎవరా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఆసక్తికర అంశాలు..


ఉత్కర్షతో రుతు (PC: IPL)

ఇంతకీ ఉత్కర్ష ఎవరు?
ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి ఐపీఎల్‌-2023 చాంపియన్‌గా నిలిచిన తర్వాత సీఎస్‌కే ఆటగాళ్లు తమ భాగస్వాములతో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ పక్కన నిల్చున్న అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు ఉత్కర్ష పవార్‌.

రుతు మాదిరే ఉత్కర్ష సైతం క్రికెటర్‌. 1998, అక్టోబరు 13న జన్మించిన ఆమె.. క్రికెటర్‌ అని సమాచారం. మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ 24 ఏళ్ల ఆల్‌రౌండర్‌.. ఇటీవల వుమెన్‌ సీనియర్‌ వన్డే ట్రోఫీలోనూ భాగమైంది. ఉత్కర్ష ఉన్నత విద్యనభ్యసించినట్లు తెలుస్తోంది. 

గత కొంతకాలంగా ప్రేమలో!
ఆమె.. పుణెలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ సైన్సెస్‌ స్టూడెంట్‌ అని సమాచారం. కాగా రుతురాజ్‌ దేశవాళీ​ క్రికెట్‌లో ప్రస్తుతం ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న తెలిసిందే. ఇక తనలాగే క్రికెటర్‌ అయిన ఉత్కర్షతో రుతు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌-2023లో అదరగొట్టాడు
ఇరు కుటుంబాల అంగీకారంతోనే వీరి పెళ్లి జరుగనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023లో రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌ ఆడి 590 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 92.

సీఎస్‌కే మరో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(15 ఇన్నింగ్స్‌లో 672 పరుగులు) తర్వాత రుతు.. చెన్నై తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఇక రుతురాజ్‌ పెళ్లి వార్త తెలియడంతో అతడి అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

చదవండి: Dhoni: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు
మధ్యలో డిస్టర్బ్‌ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్‌..పైగా..

మరిన్ని వార్తలు