Ruturaj Gaikwad: 'ఐదో సిక్సర్‌ కొట్టగానే యువరాజ్‌ గుర్తుకువచ్చాడు'

30 Nov, 2022 21:54 IST|Sakshi

దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌ హాజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఏడు బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లే కష్టసాధ్యమనుకుంటే.. రుతురాజ్‌ మాత్రం ఏకంగా ఏడు బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రుతురాజ్‌ ధాటికి శివ సింగ్‌ ఏకంగా ఒకే ఓవర్లో 43 పరుగులిచ్చుకోవాల్సి వచ్చింది. ఇక రుతురాజ్‌ తాను ఏడు సిక్సర్లు కొట్టిన సందర్భంలో యువరాజ్‌ సింగ్‌ గుర్తుకు వచ్చాడంటూ పేర్కొన్నాడు.

''వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత నాకు ఒక వ్యక్తి గుర్తుకువచ్చాడు. అతనే టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వరల్డ్‌కప్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం దగ్గరి నుంచి చూశా.నేను కూడా అలా దిగ్గజం సరసన చేరాలని భావించా. అందుకోసమే ఆరో సిక్స్‌ కొట్టాను. కానీ ఇలా ఒకే ఓవర్‌లో ఎక్కువ సిక్సర్లు కొడుతానని కలలో కూడా ఊహించలేదు'' అని రుతురాజ్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఉత్తర్‌ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో రుతురాజ్‌ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 పరుగులు సాధించాడు.

తాజాగా అస్సాంతో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో 126 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్‌.. 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు స్కోర్‌ చేశాడు. ఈ శతకంతో రుతురాజ్‌ ప్రస్తుత టోర్నీలో 4 మ్యాచ్‌ల్లో 3 శతకాలు (552 పరుగులు) తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ టోర్నీలో (2021, 2022) రుతరాజ్‌ గత 9 ఇన్నింగ్స్‌ల్లో  ఏకంగా 7 శతకాలు (168, 220 నాటౌట్‌, 40, 124 నాటౌట్‌, 168, 21, 124, 154 నాటౌట్‌, 136) బాది లిస్ట్‌-ఏ క్రికెట్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. ఇక అస్సాంపై విజయం అందుకున్న మహారాష్ట్ర ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక డిసెంబర్‌ 2న జరగనున్న ఫైనల్లో సౌరాష్ట్ర, మహారాష్ట్రలు అమితుమీ తేల్చుకోనున్నాయి.  

చదవండి: మరోసారి విధ్వంసం సృష్టించిన రుతురాజ్‌.. ఈసారి భారీ శతకంతో..!

సచిన్‌, డివిలియర్స్‌ వంటి దిగ్గజాల సరసన రుతురాజ్‌.. రోహిత్‌తో పాటుగా

మరిన్ని వార్తలు