VHT 2022 Final: ఫైనల్లోనూ అదే దూకుడు.. సెంచరీతో చెలరేగిన రుత్‌రాజ్‌ గైక్వాడ్‌

2 Dec, 2022 12:47 IST|Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీ ఫైనల్లో కూడా మహారాష్ట్ర కెప్టెన్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. సౌరాష్ట్రతో ఫైనల్లో రుత్‌రాజ్‌ మరోసారి సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న రుత్‌రాజ్‌ 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా ఈ టోర్నీలో రుత్‌రాజ్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

కాగా అస్సాంతో జరిగిన సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగిన రుత్‌ రాజ్‌.. తమ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు ఉత్తర్‌ ప్రదేశ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో ఏకంగా 220 పరుగులు సాధించాడు.

రుత్‌రాజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. సౌరాష్ట్ర టార్గెట్‌ 249 పరుగులు
ఇక ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. మహారాష్ట్ర బ్యాటర్లలో రుత్‌రాజ్‌ మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. ఇక సౌరాష్ట్ర బౌలర్లో చిరాగ్‌ జానీ మూడు వికెట్టు పడగొట్టగా.. ఉనద్కట్‌, భట్‌, మన్కడ్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IND-W vs AUS_W: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. భారత జట్టు ప్రకటన! స్టార్‌ ఆల్‌ రౌండర్‌ దూరం

మరిన్ని వార్తలు