Ryan Burl: పాక్‌పై విజయం.. జింబాబ్వే క్రికెటర్‌ పాత ట్వీట్స్‌ వైరల్‌

28 Oct, 2022 19:45 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12లో గురువారం గ్రూఫ్‌-2లో పాక్‌పై జింబాబ్వే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం జింబాబ్వేకు ఎంతో ప్రత్యేకం. 15 ఏళ్ల టి20 ప్రపంచకప్‌ చరిత్రలో జింబాబ్వే లీగ్‌ దశ ఆడడం ఇదే తొలిసారి. ఇంతకముందు చాలాసార్లు క్వాలిఫయింగ్‌ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈసారి మాత్రం తన పట్టు వదల్లేదు.

క్వాలిఫయింగ్‌ దశలో మూడింట రెండు విజయాలు సాధించి గ్రూఫ్‌ టాపర్‌గా సూపర్‌-12కు అర్హత సాధించింది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో జింబాబ్వే ఖాతా తెరవలేకపోయింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా పోరాడింది. చిన్నజట్టే కదా అని లైట్‌ తీసుకున్న పాకిస్తాన్‌ మెడలు వంచి ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.

పాక్‌పై జింబాబ్వే విజయంలో సికందర్‌ రజానే హీరో అని కచ్చితంగా చెప్పొచ్చు. కీలక సమయంలో తన బౌలింగ్‌ మాయాజాలంతో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను జింబాబ్వేవైపు తిప్పాడు. సెమీస్‌కు చేరుతుందో లేదో తెలియదు కానీ పాక్‌పై విజయంతో మాత్రం ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. జింబాబ్వే ఆటతీరు, సికందర్‌ రజా ప్రదర్శనపై ట్విటర్‌ సహా అన్ని సోషల్‌ మీడియా వేదికల్లో ప్రశంసల వర్షం కురిసింది. ఇక పాక్‌పై విజయం అనంతరం జింబాబ్వే ఆటగాడు రియాన్‌ బర్ల్‌ చేసిన పాత ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మే 2021లో రియాన్‌ బర్ల్‌ తన ట్విటర్‌ బ్లాగ్‌లో.. ''అవకాశం ఉండి మాకు షూ ఇవ్వడానికి స్పాన్సర్‌ దొరికితే ఇప్పుడున్న షూస్‌కు సిరీస్‌ అయిపోయిన ప్రతీసారి గ్లూ పెట్టాల్సిన పరిస్థితి రాదు'' అంటూ హృదయ విదారకమైన పోస్టు పెట్టాడు. అప్పట్లో రియాన్‌ బర్ల్‌ పెట్టిన ఈ పోస్టు జింబాబ్వే క్రికెట్‌ దయనీయ పరిస్థితిని కళ్లకు కట్టింది.

ఆ తర్వాత రియాన్‌ బర్ల్‌ పోస్టుకు స్పందించిన పూమా కంపెనీ జింబాబ్వే ఆటగాళ్లకు షూస్‌ను స్పాన్సర్‌ చేసి తన పెద్ద మనుసును చాటుకుంది. ఈ విషయాన్ని రియాన్‌ బర్ల్‌ మరో ట్వీట్‌ వేదికగా థ్యాంక్స్‌ చెబుతూ స్పందించాడు. ''నేను పెట్టిన ట్వీట్‌కు రియాక్ట్‌ అయి ​మాకు షూ స్పాన్సర్‌ చేయడానికి ముందుకు వచ్చిన పూమా కంపెనీకి కృతజ్థతలు. ఇదంతా అభిమానులు ఇచ్చిన మద్దతుతోనే.. థ్యాంక్స్‌ పర్‌ ఎవర్‌'' అంటూ పేర్కొన్నాడు.

రియాన్‌ బర్ల్‌ పెట్టిన పాత పోస్టులు తాజాగా వైరల్‌ అయ్యాయి. గత 15 ఏళ్లలో దారుణ ఆటతీరు కనబరిచిన జింబాబ్వే ఇప్పుడు పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. ఆ తర్వాత వన్డే సిరీస్‌ ఆడేందుకు వచ్చిన టీమిండియా సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసినప్పటికి జింబాబ్వే తమ ఆటతీరుతో ఆకట్టుకుంది. ముఖ్యంగా సికందర్‌ రజా సెంచరీతో చెలరేగడం అభిమానులకు బాగా గుర్తు.

ఇక గతేడాది ప్రపంచకప్‌కు కనీసం క్వాలిఫై కాలేకపోయిన జింబాబ్వే ఈసారి మాత్రం క్వాలిఫై కావడమే గాక సూపర్‌-12కు అర్హత సాధించింది. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో జింబాబ్వే అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో రియాన్‌ బర్ల్‌ మూడు ఓవర్లలో 10 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం. ఇక టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. సెమీస్‌ చేరడం కష్టమే కావొచ్చు కానీ మున్ముందు సంచలనాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

చదవండి: ఆ బంతి తిరిగి ఉంటే రిటైర్మెంట్‌ ఇచ్చేవాడిని!

'మ్యాచ్‌లో చెలరేగడానికి పాంటింగ్‌ వీడియోనే స్పూర్తి'

మరిన్ని వార్తలు