SA Vs Ban: రెండో టెస్టు కూడా దక్షిణాఫ్రికాదే.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

12 Apr, 2022 08:04 IST|Sakshi

దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌

రెండో టెస్టులో బంగ్లాదేశ్‌పై 332 పరుగులతో ఘనవిజయం

Bangladesh tour of South Africa 2022- కెబెర్హా (దక్షిణాఫ్రికా): బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. సోమవారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో సఫారీ జట్టు 332 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆతిథ్య స్పిన్నర్లు కేశవ్‌ మహరాజ్‌ (7/40), సైమన్‌ హార్మర్‌ (3/34) రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ పది వికెట్లను పంచుకున్నారు.

వీళ్లిద్దరు తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ కేశవ్‌ 7, హార్మెర్‌ 3 వికెట్లను పడగొట్టారు. 413 పరుగుల లక్ష్యఛేదన కోసం ఆఖరి రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 27/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లాదేశ్‌ 23.3 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. లిటన్‌ దాస్‌ (27), మెహదీ (20) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయనేలేదు. కేశవ్‌ మహరాజ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.  

కోవిడ్‌ ఎఫెక్ట్‌తో...
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి ‘కోవిడ్‌–19’ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్ల నిబంధన అమలు చేశారు. సఫారీ ఆటగాళ్లు సారెల్‌ ఎర్వి, వియాన్‌ మల్డర్‌లకు సోమవారం టెస్టులో పాజిటివ్‌ రావడంతో ఖయా జొండో, గ్లెంటన్‌ స్టుర్మన్‌లను సబ్‌స్టిట్యూట్‌గా తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు