ఐపీఎల్‌ కోసం సిరీస్‌ మధ్యలోనే పంపిస్తారా: ఆఫ్రిది

8 Apr, 2021 11:33 IST|Sakshi
పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ ఆఫ్రిది(ఫొటో కర్టెసీ: ఏఎఫ్‌పీ)

టీ20 లీగ్‌లపై పాక్‌ మాజీ క్రికెటర్‌ అసహనం! 

నెటిజన్ల సెటైర్లు

ఇస్లామాబాద్‌: క్రికెట్‌ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ)పై పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది విమర్శలు గుప్పించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021లో ఆడేందుకు ప్రొటిస్‌ ఆటగాళ్లను వన్డే సిరీస్‌ నుంచి విడుదల చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా మూడు వన్డే, నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ నిమిత్తం పాకిస్తాన్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాటి ఆఖరి వన్డే మ్యాచ్‌లో విజయం సాధించి పాక్‌ సిరీస్‌ను2-1తో కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆఫ్రిది తమ జట్టుకు అభినందనలు తెలిపాడు. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్, ఫకార్‌ జమాన్‌ అద్భుతంగా రాణించారంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. 

అదే సమయంలో క్రికెట్‌ సౌతాఫ్రికా తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ ఓ వైపు సిరీస్‌ కొనసాగుతుండగానే, మరోవైపు ఐపీఎల్‌ కోసం సీఎస్‌ఏ ఆటగాళ్లను విడుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. టీ20 లీగ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌ను ఈవిధంగా ప్రభావితం చేయడం నిజంగా విషాదకరం. ఈ నిర్ణయాలపై పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉంది’’అని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆఫ్రిది తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అయితే, అతడి కామెంట్లపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

‘‘మీ జట్టుకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు కాబట్టే ఈ విమర్శలు చేస్తున్నావా.. టీ20 లీగ్‌ల గురించి బాధపడిపోతున్నావు సరే.. మరి నువ్వు కూడా పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడిన వాడివే కదా. నీకొక రూల్‌, మిగతా వాళ్లకు ఒక రూల్‌ ఉంటుందంటావా?’’ అంటూ తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సౌతాఫ్రికా- పాక్‌ మ్యాచ్‌ విషయానికొస్తే, క్వింటన్‌ డికాక్‌, కగిసొ రబడ వంటి స్టార్‌ ఆటగాళ్లను లేకుండానే కీలకమైన మూడో వన్డే ఆడిన ప్రొటిస్‌ జట్టు 28 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకుంది. ఇక ఇరు జట్ల మధ్య ఏప్రిల్‌ 10 నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

చదవండి: పాకిస్తాన్‌దే వన్డే సిరీస్‌
వైరల్‌: ఏంటా వేగం.. బ్యాట్‌ రెండు ముక్కలైంది

>
మరిన్ని వార్తలు