వైరల్‌: షూ తీసి, చెవి దగ్గర పెట్టుకుని.. బౌలర్ సెలబ్రేషన్‌‌

12 Apr, 2021 17:34 IST|Sakshi
వికెట్‌ తీసిన ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్న షంసీ(ఫొటో కర్టెసీ: ట్విటర్‌)

జొహన్నస్‌బర్గ్‌: అర్ధ సెంచరీ, సెంచరీ చేసినపుడు లేదా కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నపుడు బ్యాట్స్‌మెన్‌, కీలకమైన వికెట్లు తీసినపుడు బౌలర్లు.. తమదైన శైలిలో ఆనందాన్ని వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉంటాం. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌కు, స్పెషల్‌ ఇన్నింగ్స్‌ తర్వాత చెవులు మూసుకుని సెలబ్రేట్‌ చేసుకోవడం అలవాటు. ఇక బౌలర్ల విషయానికొస్తే, షెల్డన్ కాట్రెల్ మార్చ్‌ సెల్యూట్‌ చేస్తూ సంబరాలు చేసుకుంటాడు. ఇలా ఒక్కో ఆటగాడు మైదానంలో ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రేజ్‌ షంసీ కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయాడు. 

అయితే, నెటిజన్లు మాత్రం అతడు సెలబ్రేట్‌ చేసుకునే విధానం చూసి.. ‘‘ఏంటీ బాబూ.. ఇలా కూడా సెలబ్రేట్‌ చేసుకుంటారా? ఇంతకు ముందెన్నడు ఇలాంటిది మేం జూడలే.. ఏదైతేనేం నీ కంటూ ఓ స్టైల్‌ ఉంది కదా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అతడేం ఏం చేశాడంటే.. పాకిస్తాన్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాటి మొదటి టీ20లో టాస్‌ గెలిచిన ప్రొటిస్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. పర్యాటక జట్టుకు 189 పరుగుల లక్ష్యం విధించింది. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా, పాక్‌ ఆటగాళ్లు బ్యాటింగ్‌ చేస్తుండగా, షంసీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్‌లో ఫఖర్‌ జమాన్‌ను, 14 ఓవర్‌లో మహ్మద్‌ హఫీజ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 

ఈ సందర్భంగా.. తన షూ తీసి, చెవి దగ్గర పెట్టుకుని, ఎవరికో ఫోన్‌ చేస్తున్నట్లుగా నటిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా షంసీ సెలబ్రేషన్‌ గురించి సహచర ఆటగాడు రసీ వన్‌ దేర్‌ దసెన్‌ మాట్లాడుతూ.. ‘‘షంసీ తన ఆనందాన్ని పంచుకునేందుకు ఇమ్మీ(ఇమ్రాన్‌ తాహిర్‌)కు ఫోన్‌ చేస్తాడు. తన ఆరాధ్య బౌలర్లలో ఇమ్మీ ఒకడు. వాళ్లిద్దరూ కలిసి ఆడారు. అందుకే వికెట్‌ తీసినప్పుడల్లా ఇమ్మీకి ఇలా ఫోన్‌ చేసి సంతోషం పంచుకుంటాడు’’అని వివరణ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన షంసీ, 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.

చదవండి: ఐపీఎల్‌ కాసుల వర్షం కురిపిస్తుంది.. కాబట్టి: పాక్‌ మాజీ పేసర్


 

>
మరిన్ని వార్తలు