SEC Vs PR: చెలరేగిన బట్లర్‌, మిల్లర్‌.. సన్‌రైజర్స్‌కు తప్పని ఓటమి.. అయినా..

25 Jan, 2023 12:29 IST|Sakshi
బట్లర్‌- స్మట్స్‌ (PC: Jio Cinema Twitter)

Sunrisers Eastern Cape vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో గత మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ తాజా మ్యాచ్‌లో ఓడిపోయింది. పర్ల్‌ రాయల్స్‌ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ మిల్లర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్‌ జట్టును గెలిపించారు. 

సెయింట్‌ జార్జ్‌ పార్క్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు రాసింగ్‌టన్‌(4), జోర్డాన్‌ హెర్మాన్‌(4) విఫలం కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ స్మట్స్‌ జట్టును ఆదుకున్నాడు.

49 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లలో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మార్కరమ్‌ బృందం 7 వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది.

బట్లర్‌ హాఫ్‌ సెంచరీ
లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మార్కో జాన్సెన్‌ జేసన్‌ రాయ్‌ను 8 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు.

మిల్లర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 39 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు. కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ 23 బంతుల్లో 4 సిక్స్‌ల సాయంతో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరు చెలరేగడంతో రాయల్స్‌ జట్టు 18.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్‌ చేసింది. రాయల్స్‌ సారథి డేవిడ్‌ మిల్లర్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

ఏ స్థానంలో ఉన్నాయంటే
కాగా ఈ ఓటమితో సన్‌రైజర్స్‌ ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. ఇక ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో రైజర్స్‌ నాలుగు గెలిచి.. నాలుగు ఓడింది. 17 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక రాయల్స్‌ సైతం 17 పాయింట్లు సాధించగా.. రైజర్స్‌(0.508) కంటే రన్‌రేటు(0.050) పరంగా వెనుకబడి మూడో స్థానంలో ఉంది.

చదవండి: మైదానంలో ‘కింగ్‌’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే!
Shubman Gill: 'చాలా క్లిష్టమైన ప్రశ్న.. కోహ్లికే నా ఓటు'

మరిన్ని వార్తలు