PC Vs PR: ఆదుకున్న బట్లర్‌.. ఓడినా సెమీస్‌కు దూసుకెళ్లిన రాయల్స్‌! టాప్‌-4లో సన్‌రైజర్స్‌ కూడా..

8 Feb, 2023 11:09 IST|Sakshi

Pretoria Capitals vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20-2023 లీగ్‌లో పర్ల్‌ రాయల్స్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓడినప్పటికీ బట్లర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా సెమీస్‌ అవకాశాలను సజీవం చేసుకుంది. పాయింట్ల పట్టికలో డర్బన్‌ సూపర్‌జెయింట్స్‌ను వెనక్కి నెట్టి టాప్‌-4లో చోటు సంపాదించింది.

అదరగొట్టిన మెండిస్‌
సెంచూరియన్‌ వేదికగా ప్రిటోరియా క్యాపిటల్స్‌, పర్ల్‌ రాయల్స్‌  మంగళవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాయల్స్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఆదుకున్న బట్లర్‌
ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ 80(41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఇంగ్రామ్‌ 41 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌(10), పాల్‌ స్టిర్లింగ్‌(19) పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జోస్‌ బట్లర్‌ బ్యాట్‌ ఝులిపించాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు రాబట్టాడు.

ఓటమి పాలైనా
అయితే, మిగతా వాళ్లలో ఇయాన్‌ మోర్గాన్‌(24), కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌(11) తప్ప ఎవరూ కూడా కనీసం సింగిల్‌ డిజిట్‌ స్కోరు దాటలేకపోయారు. దీంతో 167 పరుగులకే పర్ల్‌ రాయల్స్‌ కథ ముగిసింది. 59 పరుగులతో ఓటమిని మూటగట్టుకుంది. 

కాగా సెమీస్‌ బెర్తు కోసం పర్ల్‌, సూపర్‌జెయింట్స్‌ పోటీ పడ్డాయి. ఒకవేళ ప్రిటోరియాతో మ్యాచ్‌లో గనుక పర్ల్‌ జట్టు 62 పరుగుల తేడాతో ఓటమిపాలైతే సూపర్‌జెయింట్స్‌ సెమీస్‌కు అర్హత సాధించేది. అయితే, బట్లర్‌ 19వ ఓవర్‌ వరకు పట్టుదలగా నిలబడి ఈ ప్రమాదం నుంచి జట్టును తప్పించాడు. 

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సెమీస్‌ చేరిన జట్లు ఇవే
1. ప్రిటోరియా క్యాపిటల్స్‌
2. జోబర్గ్‌ సూపర్‌కింగ్స్‌
3. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌
4. పర్ల్‌ రాయల్స్‌

సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు ఇలా..
1. ప్రిటోరియా క్యాపిటల్స్‌ వర్సెస్‌ పర్ల్‌ రాయల్స్‌(ఫిబ్రవరి 8)
2. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌(ఫిబ్రవరి 9)

చదవండి: Asha Kiran: కడు పేదరికం.. రూ. 1000 పెన్షనే ఆధారం.. చెప్పుల్లేకుండా రోజూ 7 కిమీ పరుగు.. స్వర్ణ పతకాలతో..
BGT 2023: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!'

మరిన్ని వార్తలు