SA20 2023: ఐపీఎల్‌లో నిరాశపరిచినా.. ఆ లీగ్‌లో మాత్రం దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్‌

23 Jan, 2023 17:15 IST|Sakshi

Sunrisers Eastern Cape: గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో ఘోర పరాజయాలు మూటగట్టుకుంటూ, ఫ్యాన్స్‌ తలెత్తుకోలేకుండా చేసిన సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం అబ్బురపడే ప్రదర్శన కనబరుస్తూ, వరుస విజయాలతో అదరగొడుతుంది. సీజన్‌ను వరుస పరాజయాలతో ప్రారంభించినా, ఆతర్వాత హ్రాటిక్‌ విజయాలు, మధ్యలో ఓ ఓటమి, తాజాగా (జనవరి 22) మరో భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 17 పాయింట్లు) ఎగబాకింది.

డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ టీమ్‌..  ఓపెనర్లు ఆడమ్‌ రాస్సింగ్టన్‌ (30 బంతుల్లో 72; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), జోర్డాన్‌ హెర్మన్‌ (44 బంతుల్లో 59; 9 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసకర అర్ధశతకాలతో, కెప్టెన్‌ మార్క్రమ్‌ (34 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (13 బంతుల్లో 27 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అనంతరం  211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌.. రోల్ఫ్‌ వాన్‌ డెర్‌ మెర్వ్‌ (4-0-20-6) స్పిన్‌ మాయాజాలం ధాటికి విలవిలలాడిపోయి 86 పరుగులకే కుప్పకూలింది. సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో కైల్‌ మేయర్స్‌ (11), వియాన్‌ ముల్దర్‌ (29), కేశవ్‌ మహారాజ్‌ (12 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

సన్‌రైజర్స్‌ బౌలర్లలో వాన్‌ డెర్‌ మెర్వ్‌ ఆరేయగా.. జెజె స్మట్స్‌, మార్క్రమ్‌, జన్సెన్‌, మాసన్‌ క్రేన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. మినీ ఐపీఎల్‌గా పిలువబడే సౌతాఫ్రికా లీగ్‌ తొలి సీజన్‌లో సన్‌రైజర్స్‌ అద్భుత ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యమే ఎస్‌ఏ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ టీమ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు