MS Dhoni జెర్సీ నెం.7కు రిటైర్మెంట్‌ ఇవ్వాల్సిందే!

9 Jul, 2021 14:11 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్లలో మహేంద్ర సింగ్‌ ధోనిది ప్రత్యేక స్థానం. విజయవంతమైన సారథిగా.. బ్యాట్స్‌మెన్‌గా.. వికెట్‌ కీపర్‌గా చరిత్రలో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు సంపాదించి పెట్టిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ఘనత సాధించాడు. ‘క్రికెట్‌ దేవుడు’ సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత అంతటి క్రేజ్‌ ధోని సొంతం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి అద్భుతమైన ఆటగాడికి, తనలాంటి మరెంతో మంది దిగ్గజ క్రికెటర్లను తగిన రీతిలో సత్కరించుకోవడం బీసీసీఐ బాధ్యత అని టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ సబా కరీం అన్నాడు. ధోని జెర్సీ నంబరు 7కు రిటైర్మెంట్‌ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

కాగా సచిన్‌ టెండుల్కర్‌ ఉపయోగించిన జెర్సీ నంబరు 10ను యువ ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ ఉపయోగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దిగ్గజ ఆటగాడు ఉపయోగించిన ఈ నంబరును శార్దూల్‌కు కేటాయించడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో సబా కరీం మాట్లాడుతూ... ‘‘కేవలం ఎంఎస్‌ ధోని గురించి మాత్రమే నేను ఆలోచించడం లేదు. అలాంటి ఎంతో మంది లెజెండ్స్‌ ఉపయోగించిన జెర్సీ నంబర్లు వారికి మాత్రమే చెందినవిగా భావించాలి. తద్వారా భారత క్రికెట్‌కు వారు అందించిన సేవలకు తగిన గుర్తింపు ఇచ్చినట్లు అవుతుంది. 

వారిని సముచిత రీతిలో గౌరవించుకునే క్రమంలో.. వాటిని ఇతరులు వాడుకునేందుకు అనుమతి ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నాడు. కాగా గతేడాది ఆగస్టులో ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం గురించి సబా కరీం మాట్లాడుతూ.. ‘‘తను ఇప్పుడు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించకపోవచ్చు. కానీ, చెన్నై సూపర్‌కింగ్స్‌ వంటి జట్టు తరఫున ఎంతో మంది ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్నాడు. తన సేవలు ఇలాగే కొనసాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా మెరుగైన భవిష్యత్తుకు తన వంతు సాయం చేయడంలో ధోనీ ముందే ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు