IND vs ENG: అందుకే సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇవ్వలేదట!

19 Aug, 2021 19:17 IST|Sakshi
మహమ్మద్ సిరాజ్‌

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన లార్ట్స్ టెస్ట్‌లో టీమిండియా విజయంలో మహమ్మద్‌ సిరాజ్‌ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి అదరగొట్టిన సిరాజ్... రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో వికెట్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మొయిన్ ఆలీ, జోస్ బట్లర్‌ కలిసి 16 ఓవర్లకు పైగా వికెట్లకు అడ్డుగా నిలబడిన సమయంలో సిరాజ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 

మొయిన్ ఆలీని అవుట్‌ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపిన ఈ పేసర్‌ తర్వాత సామ్ కరాన్‌ను డకౌట్ చేశాడు. అటు తర్వాత జోస్ బట్లర్, జేమ్స్ అండర్సన్‌లను పెవిలియన్‌ పంపి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ దక్కుతుందని అంతా భావించారు. కానీ దానికి భిన్నంగా జరిగింది.

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే సిరాజ్‌ను కాదని రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడంపై భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీం స్పందించాడు.  సిరాజ్‌ ప్రదర్శన‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందని, కానీ సిరాజ్‌ కంటే రాహుల్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడని తెలిపాడు.

ప్రతికూల పరిస్థితుల్లో రాహుల్ అద్భుత బ్యాటింగ్ చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడని కరీం అన్నాడు. ఆ కారణంగానే రాహుల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కిందని చెప్పుకొచ్చాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 350 దాటడంలో  రాహుల్‌ కీలకంగా వ్యవహరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 250 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో  రాహుల్  129 పరుగులు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 126 పరుగుల  భాగస్వామ్యం నెలకొల్పాడు.
చదవండి: VVS Laxman-Mohammed Siraj: సిరాజ్ చిన్ననాటి ఫోటో షేర్‌ చేసిన వీవీఎస్‌ లక్ష్మణ్‌

మరిన్ని వార్తలు