నీ క్రీడాస్ఫూర్తికి సలామ్‌ నాదల్‌: సచిన్‌, రవిశాస్త్రి ప్రశంసలు

4 Jun, 2022 14:42 IST|Sakshi
జ్వెరెవ్‌తో నాదల్‌(PC: French Open)

‘‘వినమ్రంగా వ్యవహరించిన తీరు.. సాటి ఆటగాడి పట్ల సహృదయ భావం నాదల్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి’’ అంటూ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌పై ప్రశంసలు కురిపించారు. అతడి క్రీడాస్ఫూర్తిని కొనియాడారు.

కాగా ఫ్రెంచ్‌ ఓపెన్‌-2022 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ తొలి సెమీస్‌లో నాదల్‌- మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(జర్మనీ) తలపడ్డారు. ఈ క్రమంలో నాదల్‌ తొలి సెట్‌ గెలవగా.. రెండో సెట్‌లో నాదల్‌ రిటర్న్‌ షాట్‌ను అందుకునే క్రమంలో దురదృష్టవశాత్తూ జ్వెరెవ్‌ జారిపడ్డాడు. నొప్పి తీవ్రతరం కావడంతో మళ్లీ కోర్టులో అడుగుపెట్టలేకపోయాడు. దీంతో నాదల్‌ను విన్నర్‌గా ప్రకటించారు.

అయితే, చక్రాల కుర్చీలో బయటకు వెళ్లిన జ్వెరెవ్‌ మళ్లీ ‘క్రచెస్‌’ సాయంతో కోర్టులోకి వచ్చి ప్రేక్షకులను చూస్తూ అభివాదం చేసి వెళ్లాడు. అతడి నిష్క్రమణతో అభిమానులు నిరాశలో మునిగిపోగా.. నాదల్‌ సైతం జ్వెరెవ్‌కు ఇలా జరిగినందుకు విచారంగా కనిపించాడు. ప్రత్యర్థి ఆటగాడి పట్ల సానుభూతి చూపించాడు. భావోద్వేగానికి గురైన జ్వెరెవ్‌ను ఓదార్చాడు. ఇక జ్వెరెవ్‌ క్రచెస్‌ సాయంతో నడుస్తుండగా.. నాదల్‌ అతడి పక్కనే బాధగా ఉన్న ఫొటో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో సచిన్‌ నాదల్‌ను కొనియాడాడు.

ఇక టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి సైతం.. ‘‘ఇలాంటివి చూసినపుడే కదా హృదయం ద్రవిస్తుంది. నువ్వు త్వరలోనే తిరిగి వస్తావు జ్వెరెవ్‌. ఇక నాదల్‌ క్రీడాస్ఫూర్తికి చేతులెత్తి నమస్కరించాలి. అన్ని రకాలుగా గౌరవం అందుకునేందుకు అతడు అర్హుడు’’ అని ట్వీట్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో విజయంతో నాదల్‌ ఏకంగా 14వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.  

 ‌ 

మరిన్ని వార్తలు