ఎస్‌సీజీ గేట్‌కు సచిన్‌ పేరు

25 Apr, 2023 04:55 IST|Sakshi

50వ పుట్టిన రోజున క్రికెట్‌ ఆస్ట్రేలియా కానుక

సిడ్నీ: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సోమవారం (ఏప్రిల్‌ 24) 50వ పుట్టినరోజు జరుపుకున్నాడు. క్రికెట్‌ ప్రేక్షకులకు, ప్రత్యేకించి ‘మాస్టర్‌’ బ్యాట్స్‌మన్‌ అభిమానులకు ఇది పండగ రోజు. ఈ ‘ఫిఫ్టీ’ని మరింత చిరస్మరణీయం చేసుకునేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) వైపు నుంచి అపురూప కానుక లభించింది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎస్‌సీజీ)లోని ఓ గేట్‌కు సచిన్‌ పేరు పెట్టింది. ఈ మైదానం అతనికెంతో ప్రత్యేకమైంది. ఈ వేదికపై ‘లిటిల్‌ మాస్టర్‌’ మూడు శతకాలు సహా 785 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 241 (2004లో). ఇక్కడ సచిన్‌ 157 సగటు నమోదు చేయడం మరో విశేషం.

సోమవారం సచిన్‌ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్‌సీజీ, న్యూసౌత్‌వేల్స్‌ వేదికల చైర్మన్‌ రాడ్‌ మెక్‌ గియోచ్, సీఈఓ కెర్రీ మాథెర్, క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈఓ నిక్‌ హాక్లీ ‘సచిన్‌ గేట్‌’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సచిన్‌ అనుభవాన్ని ప్రస్తావించారు. ‘భారత్‌ వెలుపల సిడ్నీ నా ప్రియమైన మైదానం.1991–92లో నా తొలి ఆసీస్‌ పర్యటన మొదలు కెరీర్‌ ముగిసేదాకా ఎస్‌సీజీలో నాకు మరిచిపోలేని స్మృతులెన్నో వున్నాయి’ అని సచిన్‌ పేర్కొన్నారు. సచిన్‌ సమకాలికుడు బ్రియాన్‌ లారా (విండీస్‌) కూడా అక్కడ గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌ల ఆడటంతో మరో గేట్‌కు లారా పేరు పెట్టారు. తనకు కలిసొచ్చిన ఈ మైదానం పేరును లారా తన కుమార్తెకు ‘సిడ్నీ’ అని పెట్టుకున్నాడు.

మరిన్ని వార్తలు