ప్లీజ్ ఆ నిబంధనను తప్పనిసరి చేయండి : సచిన్‌

3 Nov, 2020 16:40 IST|Sakshi

దుబాయ్‌ : క్రికెట్‌లో గాయాలనేవి సహజం. ప్రతి క్రికెటర్‌కు గాయాలతో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. గాయల తీవ్రతతో కొన్నిసార్లు ఆటకు దూరమైన సందర్భాలు ఉంటే.. మరికొన్ని మాత్రం క్రికెటర్ల ప్రాణం మీదకు తెస్తుంటాయి. ఒక్కోసారి మనం చేసే తప్పులే మనకు గాయాలను కలిగిస్తుంటాయి.2014 నవంబర్‌లో ఆసీస్‌ క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బౌలర్‌ విసిరిన బంతి హెల్మెట్‌ ‍ కింది మెడ భాగంలో బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే కుప్పకూలిన హ్యూస్‌ రెండు రోజుల తర్వాత మరణించడం క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ విషాదవార్త అ‍ప్పటి క్రికెట్‌లో ఒక చెడు జ్ఞాపకంగా నిలిచిపోయింది. (చదవండి : క్రికెట్‌కు వాట్సన్‌ గుడ్‌బై)

తాజాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే అక్టోబర్‌ 24వ తేదీన కింగ్స్‌ పంజాబ్‌తో సన్‌రైజర్స్‌ తలపడింది. ఈ మ్యాచ్‌లో క్రీజులో ఉన్న విజయ్‌ శంకర్‌ పరుగు తీసే క్రమంలో కింగ్స్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌‌ విసిరిన త్రో అతని మెడకు బలంగా తగిలింది. దీంతో విజయ్‌ శంకర్‌ తీవ్రమైన గాయంతో విలవిలలాడడం కనిపించింది. వెంటనే ఫిజియోథెరపీ వచ్చి చికిత్స అందించాడు. కానీ అదృష్టవశాత్తు ఆ సమయంలో  అతను హెల్మెట్‌ ధరించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. దీనిపై సచిన్‌ టెండూల్కర్ ట్విటర్‌ వేదికగా‌ స్పందించాడు.

'సాధారణంగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటింగ్‌ చేస్తున్న ఆటగాళ్లు హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి. ఒక ఫాస్ట్‌ బౌలర్‌ బౌలింగ్‌కు వస్తే బ్యాటింగ్‌ ఆటగాడు హెల్మెట్‌ ధరించడం.. ఒక స్పిన్నర్‌ బౌలింగ్‌కు వస్తే హెల్మెట్‌ను తీసేయడం చేస్తున్నారు.కానీ ఈ పద్దతిని మార్చాలని.. బౌలర్‌ స్పిన్నరైనా.. ఫాస్ట్‌ బౌలరైనా బ్యాట్స్‌మన్‌ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించే నిబంధనను తీసుకురావాలి. హెల్మెట్‌ అనేది ఆటగాళ్లకు రక్షణగా నిలుస్తుందని.. ఈ నిబంధనను తప్పనిసరి చేయకపోతే ఆటగాళ్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే ఇకపై స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ ఏదైనా సరే హెల్మెట్‌ తప్పనిసరి ధరించాలనే నిబంధనను తీసుకురావాలని ఐపీసీని విజ్ఞప్తి చేస్తున్నా 'అంటూ ట్విటర్‌లో తెలిపాడు.

మరిన్ని వార్తలు