సచిన్‌ ప్రపంచంలో మేటి బ్యాటరే.. కానీ..! షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు

6 Mar, 2023 12:13 IST|Sakshi

Shoaib Akhtar-Sachin Tendulkar: పాకిస్తాన్‌ మాజీ స్పీడ్‌స్టర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌.. క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌పై సంచలన కామెంట్స్‌ చేశాడు. సచిన్‌కు, ప్రస్తుత టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లికి మధ్య పోలికలపై అక్తర్‌ విశ్లేషిస్తూ.. సచిన్‌ కెప్టెన్సీపై అనవసర వ్యాఖ్యలు చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌ ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ బ్యాటర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదంటూనే మాస్టర్‌ బ్లాస్టర్‌ కెప్టెన్సీలో లోపాలను వేలెత్తి చూపే ప్రయత్నం చేశాడు. 

సచిన్‌ కెప్టెన్‌గా తనను తాను ప్రూవ్‌ చేసుకోలేకపోయాడని, అందుకు అతను స్వచ్చందంగా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని, కెప్టెన్‌గా సచిన్‌ ఫెయిల్యూర్‌ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ భారం దించుకున్నాక సచిన్‌, మునుపటి కంటే ఎక్కువగా రెచ్చిపోయాడని, కోహ్లి సైతం సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత సచిన్‌లాగే చెలరేగుతున్నాడని అన్నాడు. 

కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ఆటపై ఫోకస్ పెట్టేందుకు కోహ్లికి కావాల్సిన సమయం దొరికిందని.. మనసు, మెదడు ఫ్రీ అయ్యాక కోహ్లి ఇప్పుడిప్పుడే పరుగులు చేయడం మొదలెట్టాడని తెలిపాడు. కోహ్లిని పొగడటం తన ఉద్దేశం కాదని, టీ20 వరల్డ్ కప్ 2022, ఆ తర్వాత కోహ్లి గణాంకాలు చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్ధమవుతుందని చెప్పుకొచ్చాడు. 

ఈ తరంలో కోహ్లికి మించిన బ్యాటర్‌ లేడని ఆకాశానికెత్తిన అక్తర్‌.. కోహ్లి కూడా ఒకానొక సమయంలో సచిన్‌ లాగే జట్టు భారాన్నంతా మోశాడని కితాబునిచ్చాడు. కాగా, సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి పరిమిత​ ఓవర్ల ఫార్మాట్‌లో రెచ్చిపోతున్నప్పటికీ.. టెస్ట్‌ల్లో మాత్రం వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఇప్పటివరకు 3 టెస్టులు ఆడిన కోహ్లి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. 

మరిన్ని వార్తలు