సచిన్‌ వీరాభిమానిపై పోలీస్‌ జులుం.. ప్రారంభోత్సవం చేసిన స్టేషన్‌లోనే..!

22 Jan, 2022 21:25 IST|Sakshi

Sachin Die Hard Fan Beaten By Police: క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ వీరాభిమాని సుధీర్‌ కుమార్‌ చౌదరి అంటే తెలియని వాళ్లు బహుశా భారత క్రికెట్‌ వర్గాల్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు. సచిన్‌ రిటైర్మెంట్‌ వరకు టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో అతను స్టాండ్స్‌లో దర్శనమిచ్చే వాడు. ఇంటా, బయటా అన్న తేడా లేకుండా సచిన్‌ ఆడిన ప్రతి మ్యాచ్‌ను చూసేందుకు అతను ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. అతనికి కొన్ని సందర్భాల్లో బీసీసీఐయే ప్రత్యేక రాయితీలు కల్పించి మ్యాచ్‌ వీక్షించేందుకు పంపేది. 

సచిన్‌ సైతం సుధీర్‌కి చాలా మర్యాద ఇచ్చే వాడు. చాలా సందర్భాల్లో అతన్ని సత్కరించడంతో పాటు అతని అవసరాలను కూడా తీర్చాడు. విదేశాల్లో జరిగే టోర్నీల కోసం అతని విమాన చార్జీలను కూడా సచినే స్వయంగా భరించేవాడు. సచిన్‌ను దైవంతో సమానంగా ఆరాధించే సుధీర్‌.. క్రికెటేతర కారణాల చేత తొలిసారి వార్తల్లోకెక్కాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ పోలీసులు తనపై దాడి చేసి హింసించారని ఆయన ఆరోపించాడు. 

ఓ కేసు విషయంలో సోదరుడు కిషన్‌ కుమార్‌ను ముజఫర్‌పూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేయగా, అతన్ని కలిసేందుకు వెళ్లిన తనను స్థానిక డ్యుటీ ఆఫీసర్‌ దుర్భాషలాడాడని, అంతటితో ఆగకుండా కాళ్లతో తన్ని, స్టేషన్‌ బయటికి గెంటేశాడని సుధీర్‌ ఆరోపించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రెస్‌ మీట్‌ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనను దూషించి, గాయపరచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశాడు. కాగా, రెండేళ్ల క్రితం ఇదే పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించారని సుధీర్‌ వెల్లడించడం విశేషం.    
చదవండి: రైతుగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్..

మరిన్ని వార్తలు