తండ్రికి ఇచ్చిన మాట కోసం సచిన్‌ ఏం చేశాడంటే..?

1 Jun, 2023 14:48 IST|Sakshi

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (మే 31) సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.  కెరీర్‌ ప్రారంభంలో పొగాకు ఉత్పత్తుల ప్రమోషన్స్‌ కోసం భారీ ఆఫర్లు వచ్చాయని, పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయనని తన తండ్రికి ఇచ్చిన మాట కోసం వాటిని తిరస్కరించానని సచిన్‌ చెప్పుకొచ్చారు. 

పొగాకు కంపెనీలు తమ తరఫున ప్రచారం చేయమని బ్లాంక్‌ చెక్‌లు ఇచ్చేవారని, అయినా ఏ రోజు వారికి ఓకే చెప్పలేదని తెలిపారు. తన సహచరుల్లో చాలామంది బ్యాట్‌పై పొగాకు ఉత్పత్తుల (సిగరెట్‌) స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసే వారని, తాను కెరీర్‌ ఆరంభంలో రెండేళ్ల పాటు ఏ అడ్వర్టైజ్‌మెంట్‌ స్టిక్కర్‌ను తన బ్యాట్‌పై అంటించుకోలేదని తెలిపారు. 

తన తండ్రి తాను ప్రజలకు రోల్‌ మోడల్‌గా ఉండాలని కోరుకున్నారని.. నేను చేసే ప్రతి పనిని వారు అనుకరించే ప్రయత్నం చేస్తారని ఆయన చెప్పారని, అందుకే పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. తన తండ్రికి ఇచ్చిన మాటకు నేటికీ కట్టుబడి ఉన్నానని.. మున్ముందు కూడా పొగాకు ఉత్పత్తులకు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయనని సచిన్‌ స్పష్టం చేశారు.

చదవండి: AsiaCup 2023: కొత్త ట్విస్ట్‌.. పాక్‌ లేకుండానే టోర్నీ నిర్వహణ!

>
మరిన్ని వార్తలు