నిన్ను చాలా మిస్‌ అవుతున్నా వార్న్‌.. స్వర్గంలో నువ్వు..: సచిన్‌ భావోద్వేగ ట్వీట్‌

4 Mar, 2023 17:05 IST|Sakshi
సచిన్‌ టెండుల్కర్‌- షేన్‌ వార్న్‌ (PC: Sachin Tendulkar)

Shane Warne Death Anniversary- Sachin Tendulkar Emotional Note: ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ను తలచుకుని టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా వార్న్‌ అంటూ ఆసీస్‌ లెజెండ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. కాగా గతేడాది మార్చి 4న స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ హఠాన్మరణం చెందిన విషయం విదితమే.

మొదటి వర్ధంతి
థాయ్‌లాండ్‌లో ఉన్న సమయంలో గుండెపోటుతో కుప్పకూలిన వార్న్‌ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. ఈ విషాదకర వార్త తెలిసి క్రికెట్‌ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. స్వదేశంలో అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ ప్రభుత్వ లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా వార్న్‌ మొదటి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచర ఆటగాళ్లు అతడిని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు.

నువ్వు ఆ స్వర్గాన్ని కూడా..
ఈ క్రమంలో సచిన్‌ టెండుల్కర్‌ వార్న్‌తో కలిసి ఉన్న ఫొటో పంచుకుంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు.  ‘‘మైదానంలో మనం పోటాపోటీగా ఆడిన సందర్భాలున్నాయి.. అదే సమయంలో మైదానం వెలుపలా మనకంటూ కొన్ని మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక గొప్ప క్రికెటర్‌గా మాత్రమే కాదు.. ఓ మంచి స్నేహితుడిగా కూడా నేను నిన్ను చాలా మిస్‌ అవుతున్నాను.

నీ చరిష్మా, హాస్యచతురతతో నువ్వు ఆ స్వర్గాన్ని మరింత అందమైన ప్రదేశంగా మారుస్తూ ఉంటావని నాకు తెలుసు వార్నీ!’’ అంటూ సచిన్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సచిన్‌- వార్న్‌ మధ్య మంచి అనుబంధం ఉంది.

ఒక్క ముక్క చికెన్‌ తినగానే.. వామ్మో..
గతంలో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణ సందర్భంగా షేన్‌ వార్న్‌ సచిన్‌ ఇంట్లో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. ‘ఒకరోజు ముంబైలో ఉన్న వాళ్లింటికి వెళ్లాను. డిన్నర్‌ చేసి తర్వాత హోటల్‌కి వెళ్దామని అనుకున్నా.

అక్కడ ఒక్క చికెన్‌ ముక్క తినగానే నాకు దిమ్మతిరిగిపోయింది. అయినా సరే మెల్లమెల్లగా తినడానికి ప్రయత్నించా. ఎందుకంటే నాకు సచిన్‌ పట్ల, అతడి కుటుంబం పట్ల ఎంతో గౌరవం ఉంది. వాళ్లు నాపై ప్రేమను కురిపిస్తారు’’ అని వార్న్‌ పేర్కొన్నాడు.

మా కోసం భరించాడు
ఇందుకు స్పందించిన సచిన్‌.. ‘నీకు ఇండియన్‌ ఫుడ్‌ ఇష్టమేనా అని అడిగాడు. అందుకు వార్న్‌.. అవును.. నాకు చాలా చాలా ఇష్టమని సమాధానమిచ్చాడు. మిగతా వాళ్లకు భోజనం వడ్డిస్తున్న సమయంలో షేన్‌ తనే తన ప్లేట్‌లో ఫుడ్‌ పెట్టుకున్నాడు.

తను ఆ స్పైసీ ఫుడ్‌ తినలేకపోతున్నాడని నాకు అర్థమైంది. కానీ మమ్మల్ని బాధపెట్టడం ఇష్టంలేక తను కాసేపు అలాగే ఉండిపోయాడు. మా మేనేజర్‌ను పిలిచి విషయం చెప్పాడు. తర్వాత తనే కిచెన్‌లోకి వెళ్లి బీన్స్‌, చిదిమిన ఆలుగడ్డలతో ఫుడ్‌ ప్రిపేర్‌ చేసుకున్నాడు’’ అని వార్న్‌ గురించి గొప్పగా చెప్పాడు. 

చదవండి: Ind vs Aus: ఇంకెప్పుడు బ్యాట్‌ ఝులిపిస్తారు? సూర్యను తీసుకోండి: పాక్‌ మాజీ స్పిన్నర్‌
అగ్రస్థానానికి ఎగబాకిన ఇంగ్లండ్‌

మరిన్ని వార్తలు