Sachin Tendulkar: మాస్టర్‌ బ్లాస్టర్‌ రిటైర్మెంట్‌కు 8 ఏళ్లు.. క్యాచ్‌ పట్టినా సెలబ్రేట్‌ చేసుకోలేదు

16 Nov, 2021 16:50 IST|Sakshi

Sachin Tendulkar Retires From International Cricket Nov 16, 2013 Completes 8 Years.. టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌.. ఈ పేరు వినని వారుండరు. క్రికెట్ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులు తన సొంతం చేసుకున్న సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి నేటితో ఎనిమిదేళ్లు పూర్తియింది. 2012లో వన్డేలు.. 2013లో టి20లకు గుడబై చెప్పిన సచిన్‌కు మిగిలి ఉంది టెస్టులు మాత్రమే. అందుకే స్వదేశంలో సొంతగడ్డ ముంబై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో రిటైర్మెంట్‌ ఇవ్వాలని భావించాడు.

నవంబర్‌ 16, 2013.. వెస్టిండీస్‌తో ముంబై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ సచిన్‌కు 200వది.. అంతర్జాతీయంగా అదే ఆఖరుది. సచిన్‌ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో స్టాండ్స్‌లోని ప్రేక్షకులు అందరు లేచి ''సచిన్‌.. సచిన్‌..'' అంటూ గట్టిగా అరుస్తే స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత విండీస్‌ క్రికెటర్లు, అంపైర్లు సచిన్‌కు గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఇస్తూ అతనికి గౌరవాన్నిచ్చారు. ఇక ఈ మ్యాచ్‌లో సచిన్‌ 74 పరుగులు చేసి విండీస్‌ స్పిన్నర్‌ నర్సింగ్‌ డియోనరైన్‌ బౌలింగ్‌లో డారెన్‌ సామికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే సచిన్‌ క్యాచ్‌ పట్టిన సామి మాత్రం  సంబరాలు చేసుకోలేదు. ఎందుకంటే సచిన్‌కు అంతర్జాతీయంగా అదే చివరి మ్యాచ్‌. ఆ తర్వాత అతను మైదానంలో కనిపించడు.. అందుకే ఎమోషనల్‌ అయిన సామి నిరాశగా కనిపించడం అప్పట్లో వైరల్‌గా మారింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం సచిన్‌ ఇచ్చిన ఎమోషనల్‌ స్పీచ్‌ చరిత్రలో నిలిచిపోయింది.

''సమయం చాలా తొందరగా అయిపోయింది. ప్రేక్షకులతో నాకు బాండింగ్‌ ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ''సచిన్‌.. సచిన్‌'' అని విన్న ప్రతీసారి నాలో ఏదో తెలియని వైబ్రేషన్స్‌ వచ్చేవి. ఇకపై వాటిని మిస్సవుతున్నా అంటే తట్టుకోలేకపోతున్నా. ఎంతైనా సొంత అభిమానుల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం చిరకాలం గుర్తుండిపోతుంది. ఇక 24 ఏళ్ల నా క్రికెట్‌ కెరీర్‌లో మీరిచ్చిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. నా ఊపిరి ఉన్నంతవరకు అవి నాతో పదిలంగా ఉంటాయి'' అని సచిన్‌ చెప్పిన ప్రతీ మాట అభిమానులతో పాటు క్రికెటర్లను కంటతడి పెట్టించింది.

ఇక 2019లో ఐసీసీ ఆల్‌ హాఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించిన సచిన్‌ 1989లో తన 16వ ఏట టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 34, 357 పరుగులు చేసిన సచిన్‌ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న లంక దిగ్గజం కుమార సంగక్కరకు.. సచిన్‌కు మధ్య 6వేల కంటే ఎక్కువ పరుగుల దూరం ఉండడం విశేషం. ఇక వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ అందుకున్న ఆటగాడిగా.. టెస్టులు(51సెంచరీలు), వన్డేలు(49 సెంచరీలు) కలిపి వంద సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. ఓవరాల్‌గా టీమిండియా తరపున 200 టెస్టుల్లో 15,921 పరుగులు.. 463 వన్డేల్లో 18,426 పరుగులు సాధించాడు.

- సాక్షి, వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు