10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్‌

17 May, 2021 12:58 IST|Sakshi

ముంబై: ‘‘దాదాపు 10 నుంచి 12 ఏళ్లపాటు తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అయితే కాలక్రమేణా నాలో మార్పు వచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా మారటం, ఆటకు ముందే మానసికంగా, శారీరకంగా సన్నద్ధమవటం నేర్చుకున్నా. మానసికి ప్రశాంతత పొందేందుకు నచ్చిన పనులు చేశాను’’ అని టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వెల్లడించాడు. కాగా గతేడాది మొదలైన మహమ్మారి కరోనా ప్రభంజనం నేటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కంటికి కనిపించని వైరస్‌ ధాటికి మానవాళి వణికిపోతోంది. 

ఆత్మీయుల మరణాలు, లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోవడం వంటి పరిణామాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇక ఆటగాళ్లు సైతం ఇందుకు అతీతులు కారు. ముఖ్యంగా క్రికెటర్లు నెలల తరబడి కుటుంబాలకు దూరంగా బయో బబుల్‌లో ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్‌అకాడమీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్‌ టెండుల్కర్‌ మాట్లాడుతూ... ‘‘ఏ విషయాన్నైనా సరే మన మనసు అంగీకరించేలా సంసిద్ధులం కావాలి. కేవలం శారీరంకగానే కాదు, మానసికంగా కూడా బలంగా ఉండాలి.  

అప్పుడే ఒత్తిడిని జయించగలం. అనుభవం దృష్ట్యా ఈ మాటలు చెబుతున్నా. నిజానికి మైదానంలో అడుగుపెట్టే ముందు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేవాడిని. అలాంటి సమయంలో టీ పెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయడం,  బ్యాగు సర్దుకోవడం వంటి వ్యాపకాల ద్వారా మనసును తేలికపరచుకునే వాడిని. నా చివరి మ్యాచ్‌ ఆడేంతవరకు ఇవే అలవాట్లను కొనసాగించాను’’ అంటూ తన అనుభవాల గురించి పంచుకున్నాడు.

‘‘గాయాల బారిన పడినపుడు ఫిజియోలు, డాక్టర్లు మన వెంటే ఉండి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు. నిజానికి మెంటల్‌ హెల్త్‌ విషయంలో కూడా ఇలాగే మనం చొరవ తీసుకుని వైద్యుడిని సంప్రదించాలి. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎత్తుపళ్లాలు సహజం. అలాంటి సమయంలో ఆత్మీయుల అండ దొరికితే మనసు తేలికపడుతుంది. ప్రధానంగా ఏ విషయాన్నైనా స్వీకరించే గుణం అలవడినప్పుడే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. స్వాంతన చేకూరుతుంది’’ అంటూ సచిన్‌, ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. 

చదవండి: Mike Hussey: స్వదేశానికి బయలుదేరిన హస్సీ

మరిన్ని వార్తలు