Sachin Tendulkar: మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడం సంతోషం.. కానీ

10 Mar, 2022 10:06 IST|Sakshi

క్రికెట్‌లో ఎంసీసీ(మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ అసోసియేషన్‌) సవరించిన కొత్త రూల్స్‌ సంతోషం కలిగించాయని టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. ''ఎంసీసీ కమిటీ తీసుకొచ్చిన కొత్త రూల్స్‌ బాగున్నాయి.. అందులో కొన్నింటికి నేను మద్దతు ఇస్తున్నా. ముఖ్యంగా మన్కడింగ్‌ విషయంలో మార్పు తీసుకురావడం అభినందనీయం. క్రీజులో ఉన్న బ్యాటర్‌కు మన్కడింగ్‌ అనే పదం ఇబ్బందిగా అనిపించేది. తాజాగా మన్కడింగ్‌ పదాన్ని రనౌట్‌గా మార్చారు. నా దృష్టిలో మన్కడింగ్‌ అనేది రనౌట్‌గానే పరిగణిస్తారు. ఒక రకంగా ఇది మంచిదే అయినప్పటికి.. అందరికి సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు.

ఇక రెండో రూల్‌ ఒక బ్యాట్స్‌మన్‌ క్యాచ​ ఔట్‌గా వెనుదిరిగినప్పుడు.. క్రీజులోకి కొత్త బ్యాటర్‌ రావాలనే నిర్ణయం కూడా బాగా నచ్చింది. ఎందుకంటే.. ఒక బౌలర్‌ వికెట్‌ తీసి సక్సెస్‌ ట్రాక్‌లో ఉండడం సక్సెస్‌గా కనిపించినప్పుడు.. అతను కొత్త బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్‌ చేయడం కూడా ఫెయిర్‌గానే కనిపిస్తుంది. ఈ కొత్త రూల్‌ బాగుంది.. వెల్‌డన్‌'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక క్రికెట్‌ చట్టాలు చేసే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్‌లో రనౌట్‌! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్‌ కానే కాదిపుడు. ఎంసీసీ చేసిన పలు సవరణలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్‌ తర్వాతే అమలవుతాయి. 

ఎంసీసీ సవరణలివి... 
►సలైవా (ఉమ్ము), చెమటతో బంతిని రుద్దడం పూర్తిగా నిషిద్ధం. కరోనా వల్ల ఇప్పుడైతే చెమట, ఉమ్ముతో బంతిని షైన్‌ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇకపైనా కుదరదు.  
►క్యాచ్‌ అవుట్‌ అయిన బ్యాటర్‌ సగం పిచ్‌ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్‌ చేయాలి. ఓవర్‌ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్‌ దాటిన నెపంతో నాన్‌ స్ట్రయికర్‌ బ్యాటింగ్‌ చేయడానికి వీలులేదు.
►ఫీల్డింగ్‌ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్‌ భారీషాట్‌ ఆడినపుడు బ్యాటింగ్‌ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్‌ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్‌ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్‌) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. 

>
మరిన్ని వార్తలు