Sachin Tendulkar: అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్‌తో మరో దిగ్గజం

15 Jul, 2022 17:32 IST|Sakshi

ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య జరిగిన రెండో వన్డేకు భారత్‌ నుంచి దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. లార్డ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌కు సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోని, సురేశ్‌ రైనా సహా మరికొంతమంది ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇదే మ్యాచ్‌కు వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో సచిన్‌.. గారీ సోబర్స్‌తో దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేసుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ''సర్‌ గారీతో లార్డ్స్‌లో మ్యాచ్‌ చూసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.. ఇది నిజంగా స్పెషల్‌ మూమెంట్‌'' అంటూ ట్వీట్‌ చేశాడు.

ఇక గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ వెస్టిండీస్‌ నుంచి వచ్చిన దిగ్గజ ఆల్‌రౌండర్‌. విండీస్‌ తరపున సోబర్స్‌ 93 టెస్టుల్లో 8032 పరుగులు సహా బౌలింగ్‌లో 235 వికెట్లు పడగొట్టాడు. వన్డే కెరీర్‌లో మాత్రం ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా సోబర్స్‌ నిలిచాడు. కాగా సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ పేరిట 2004 నుంచి ఐసీసీ అవార్డు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐసీసీ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ అవార్డును(ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌) పాకిస్తాన్‌ బౌలర్‌  షాహిన్‌ అఫ్రిది దక్కించుకున్నాడు.

ఇక భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గురించి ఎంత చెప్పినా సరిపోదు. క్రికెట్‌ గాడ్‌గా పేరు పొందిన సచిన్‌ క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు(టెస్టుల్లో 51, వన్డేల్లో 49) కొట్టిన తొలి ఆటగాడిగా సచిన్‌ చరిత్ర పుటల్లో నిలిచాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న తొలి ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. టెస్టుల్లో 15,921 పరుగులు, వన్డేల్లో 18,246 పరుగులు సాధించాడు.

ఇక రెండో వన్డే విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రీస్‌ టాప్లీ ఆరు వికెట్లతో దుమ్మురేపడంతో భారత్‌ 143 పరుగులకే ఆలౌటైంది. అంతకముందు ఇంగ్లండ్‌ 49 ఓవర్లలో 243 పరుగులుకు ఆలౌట్‌ అయింది. ఇరుజట్ల మధ్య చివరి వన్డే(జూలై 17న) ఆదివారం జరగనుంది. 

చదవండి: England Cricketer Reece Topley: ఇంగ్లండ్‌ స్టార్‌ రీస్‌ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే

Scott Styris: 'స్విచ్‌హిట్‌ బ్యాన్‌ చేస్తే ఎక్కువగా సంతోషించేది నేనే'

మరిన్ని వార్తలు