IPL 2022 RCB Vs GT: గుజరాత్‌ బ్యాటర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్‌

21 May, 2022 12:25 IST|Sakshi

గుజరాత్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌, వెటరన్‌ వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాపై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో సాహా మోస్ట్‌ అండర్‌ రేటెడ్‌ ప్లేయర్‌ అని పేర్కొన్నాడు. సాహాలో టాలెంట్‌ ఉన్నా అదృష్టం కలిసిరావట్లేదని అభిప్రాయపడ్డాడు. లేటు వయసులో సాహా అదిరిపోయే ప్రదర్శనలతో రెచ్చిపోతున్నాడని కితాబునిచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సాహా.. మోస్ట్‌ డేంజరెస్‌ ప్లేయర్‌గా మారాడని, అతను మైదానం నలుదిక్కులా షాట్లు ఆడగలుగుతున్నాడని, సాహాకు తాను హై రేటింగ్‌ ఇస్తానని ప్రశంసలు కురిపించాడు. సాహా.. ఎలాంటి బౌలింగ్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టగల ప్రతిభావంతుడైన ఆటగాడని కొనియాడాడు. 

అతను క్రీజులో నిలదొక్కుకుంటే అత్యంత ప్రమాదకర ఆటగాడని ఆకాశానికెత్తాడు. సాహా ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకొని, అతనికి టీమిండియాలో అవకాశం కల్పించాలని సెలెక్టర్లకు పరోక్ష సూచన చేశాడు. ఈ మేరకు సచిన్‌ తన లేటెస్ట్‌ యూట్యూబ్ వీడియోలో సాహాపై తన పాజిటివిటీని వ్యక్తపరిచాడు. 

ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన సాహా.. 39 సగటున 312 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌తో వివాదంలో ఇటీవలే క్లీన్‌ చిట్‌ పొందిన సాహా.. తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. బెంగాల్‌ రంజీ జట్టులో అవకాశం ఇస్తామన్నా.. తనను జట్టు నుంచి రిలీవ్‌ చేయాలని రాద్ధాంతం చేస్తున్నాడు. టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడిన సాహా 3 సెంచరీలు, అర్ధసెంచరీల సాయంతో 1394 పరుగులు చేశాడు. టెస్ట్‌ ప్లేయర్‌గా ముద్రపడిన ఈ బెంగాలీ వెటరన్‌.. ఆ ముద్రను చెరిపేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే అతను బ్యాట్‌ను ఝులిపించడం మొదలుపెట్టాడు. ఐపీఎల్‌లో 142 మ్యాచ్లు ఆడిన సాహా పేరిట ఐపీఎల్‌లో ఓ శతకం కూడా నమోదై ఉంది.
చదవండి: 'అర్థం పర్థం లేని ట్వీట్స్‌.. మాకేదో తేడా కొడుతుంది'

మరిన్ని వార్తలు