Saina Nehwal: 'దేశానికి గోల్డ్‌ మెడల్‌ తీసుకురా అన్నప్పుడు నవ్వుకున్నా'

6 Dec, 2022 08:05 IST|Sakshi

గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆధ్వర్యంలో జరిగిన 'ఉమెన్‌ ఇన్‌ మెడిసిన్‌ కాంక్లేవ్‌' కార్యక్రమంలో స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా మహిళలు క్రీడల్లో రాణించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'' దేశంలో పాపులర్‌ క్రీడగా పేరున్న క్రికెట్‌తో బ్యాడ్మింటన్‌ను పోల్చలేము. అయితే చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌పై ఇష్టం పెంచుకున్న నాకు తల్లిదండ్రుల నుంచి మంచి సపోర్ట్‌ లభించింది. అయితే బ్యాడ్మింటన్‌లోనూ మహిళలు, పురుషులకు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. మాతో పోలిస్తే పురుషుల బ్యాడ్మింటన్‌కు కాస్త క్రేజ్‌ ఎక్కువ.

అలాంటి స్థితిలోనూ నేను బ్యాడ్మింటన్‌లో రాణించడం సంతోషంగా అనిపించింది. తొమ్మిది, పదేళ్ల వయస్సు నుంచి రెగ్యులర్‌గా బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో పాల్గొనేదాన్ని. ఆ టోర్నమెంట్‌లో ఇచ్చిన రూ.500, 1000 ప్రైజ్‌మనీ.. ఇలా ఒక్క రూపాయి వచ్చిన ఇంట్లోనే ఇచ్చేదాన్ని. అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్‌లో పతకాలు అనగానే మొదటగా కొరియా,చైనా, జపాన్‌ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆయా దేశాల్లో బ్యాడ్మింటన్‌ ఆటలో కత్తిలాంటి ప్లేయర్లు తయారవుతున్నారు. కానీ మన దేశంలో అలా కాదు.

క్రికెట్‌ లాంటి పాపులర్‌ గేమ్‌ వెనుక బ్యాడ్మింటన్‌ లాంటివి చిన్న గేమ్స్‌గా చూస్తారు. అయితే నా తండ్రి ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కొడితే చూడాలని ఉందని ఒకరోజు అన్నాడు. అది విన్న నాకు నవ్వు వచ్చింది. కానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని బ్యాడ్మింటన్‌లో రాణించాలని నా తండ్రి బలంగా కోరుకున్నాడు. అలా ఇవాళ మీ ముందు ఉన్న సైనా నెహ్వాల్‌ ఈరోజు స్టార్‌ బ్యాడ్మింటన్‌గా పేరు సంపాదించింది.  ఇక కెరీర్‌లో ఎన్నో టైటిల్స్‌ గెలిచినప్పటికి ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకం సాధించడం గర్వంగా అనిపించేది. ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా రాణించడం చూస్తే ప్రపంచంతో పోటీ పడి పరుగులు తీస్తున్నామన్న విషయం స్పష్టమవుతోంది'' అంటూ చెప్పుకొచ్చింది.

చదవండి: తన ముఖం కూడా చూడను! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..

మరిన్ని వార్తలు