ఆసియా క్రీడలకు సైనా దూరం! కారణమిదే

2 May, 2023 09:52 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లలో చైనాలో జరిగే ఆసియా క్రీడలకు దూరం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక కోసం ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సెలెక్షన్‌ట్రయల్స్‌ టోర్నీలో సైనా నెహ్వాల్‌ పాల్గొనడంలేదు.

‘ఫిట్‌నెస్‌ సంబంధిత సమస్యల కారణంగా సైనా ట్రయల్స్‌లో బరిలోకి దిగడంలేదు. సైనాతోపాటు పురుషుల డబుల్స్‌ జోడీ కుశాల్‌ రాజ్, ప్రకాశ్‌ రాజ్‌ కూడా ట్రయల్స్‌ టోర్నీ నుంచి వైదొలిగారు’ అని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కార్యదర్శి సంజయ్‌ మిశ్రా తెలిపారు. 

చదవండి:  ‘బ్రిజ్‌భూషణ్‌ను రక్షించే ప్రయత్నమిది’
న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన కొనసాగిస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు అన్ని వైపుల నుంచి సంఘీభావం లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్‌ నేత, భారత మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా వేదిక వద్దకు వచ్చి తన మద్దతు ప్రకటించాడు.

రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అతనిపై చర్యకు వెనుకాడుతోందని సిద్ధూ విమర్శించాడు. ‘ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు ఆలస్యం చేశారు. అందులో వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు. దానిని బలహీనంగా తయారు చేశారని అర్థమవుతోంది. అన్నీ దాచేసి బ్రిజ్‌భూషణ్‌ను రక్షించే ప్రయత్నమే ఇదంతా.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకు అరెస్ట్‌ ఎందుకు చేయలేదు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’ అంటూ సిద్ధూ వ్యాఖ్యానించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా రెజ్లర్లకు సంఘీభావం పలకగా... రేడియోలో ‘మన్‌కీ బాత్‌’ కాదు, రెజ్లర్ల వద్దకు వచ్చి వారి మన్‌కీ బాత్‌ వినాలని ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ సూచించారు.

మరోవైపు తనను ఉరి తీసినా పర్వాలేదని, రెజ్లింగ్‌ పోటీలు మాత్రం ఆగరాదని బ్రిజ్‌భూషణ్‌ అన్నాడు. ‘గత నాలుగు నెలలుగా రెజ్లింగ్‌ కార్యకలాపాలు ఆగిపోయాయి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి. తక్షణం ఎవరి ఆధ్వర్యంలోనైనా క్యాడెట్‌ నేషనల్స్‌ నిర్వహించండి. లేదంటే వయసు పెరిగి కుర్రాళ్లు అవకాశం కోల్పోతారు. నన్ను ఉరి తీయండి కానీ ఆట మాత్రం ఆగవద్దు’ అని బ్రిజ్‌భూషణ్‌ చెప్పాడు.    

>
మరిన్ని వార్తలు