అనుకున్న దానికన్నా ఉత్తమంగా ఆడాం: సాత్విక్‌ సాయిరాజ్‌

8 Aug, 2021 08:54 IST|Sakshi

పారిస్‌ ఒలింపిక్స్‌ లక్ష్యంగా సాధన

ఒడిశా తరహాలో రాష్ట్రాలు ఒక్కో క్రీడను దత్తత తీసుకోవాలి

‘సాక్షి’తో సాత్విక్‌ సాయిరాజ్‌

అమలాపురం: ‘అనుకున్న దానికన్నా ఉత్తమంగా ఆడాం. క్వార్టర్స్‌కు వచ్చి ఉంటే పతకం సాధించేవాళ్లం. మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచినా క్వార్టర్స్‌కు అవకాశం రాలేదు. మా ప్రతిభ నిరాశపరచలేదు. ఫలితం అనుకూలం రాలేనందుకు బాధగా ఉన్నా 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తాను’ అని షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు సాత్విక్‌ సాయిరాజ్‌ పేర్కొన్నాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో త్రుటిలో క్వార్టర్‌ ఫైనల్స్‌ అవకాశం కోల్పోయిన సాత్విక్‌ శనివారం సొంత ఇంటికి చేరాడు. ఈ సందర్భంగా అమలాపురంలో ఘన స్వాగతం లభించింది. ఆయన ‘సాక్షి’తో టోక్యో అనుభవాలను పంచుకున్నాడు. సాత్విక్‌ మాట్లాడుతూ..  

ప్రణాళికతో సిద్ధమవుతా..
‘చిరకాల కోరిక తీరింది. ఒలింపిక్స్‌ వేదికపై మన వాళ్లు ఎవరైనా ఆడుతుంటే టీవీలో ఆసక్తిగా చూసేవాడిని. అలాంటిది నేనే ఆడుతున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. నిబంధన మేరకు ఏ జట్టు ఎక్కువ సెట్లు గెలిచారనే అంశం పరిగణలోకి తీసుకోవడం వల్ల క్వార్టర్స్‌ అవకాశం కోల్పోయాం. అయినా ప్రతిభతో క్రీడాభిమానుల మన్నననలు పొందాం. 2024లో పారిస్‌ ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే సిద్ధమవుతాను. ప్రణాళికతో ఆడుతూ ఫిట్‌నెస్‌ పెంచుకుంటాను. డబుల్స్‌ కోచ్‌ను ఎంపిక చేసుకుని సాధన చేస్తాను. అట్టడుగు స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తే మనకు ఎక్కువ పతకాలు వస్తాయి.

ఇతర దేశాల్లా లాంగ్‌ గోల్‌ పెట్టుకోవాలి. కనీసం నాలుగు, ఎనిమిదేళ్ల తరువాత జరిగే ఒలింపిక్స్‌కు క్రీడాకారులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి. దీటైన సదుపాయాలుండాలి. అథ్లెటిక్స్‌లో నిరంతరం పోటీలు జరగాలి. ఒడిశా హాకీని దత్తత చేసుకున్నట్టుగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క క్రీడను దత్తత చేసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాను.’ అని సాత్విక్‌ సాయిరాజ్‌ తెలిపాడు.  

మరిన్ని వార్తలు