చాంప్స్‌ శాతవాహన, ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజి జట్లు

24 Apr, 2021 05:16 IST|Sakshi
జూనియర్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన శాతవాహన జూనియర్‌ కాలేజి (శ్రీకాకుళం) జట్టు

రన్నరప్‌గా ఎమరాల్డ్స్, కృష్ణ చైతన్య కాలేజి జట్లు

సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ  

విజయవాడ స్పోర్ట్స్‌: సాక్షి మీడియా గ్రూప్, కేఎల్‌ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్‌పీఎల్‌) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో జూనియర్స్‌ విభాగంలో శాతవాహన జూనియర్‌ కాలేజీ (శ్రీకాకుళం)... సీనియర్స్‌ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్‌ డిగ్రీ కాలేజి (అనంతపురం) జట్లు చాంపియన్స్‌గా నిలిచాయి. జూనియర్‌ విభాగం ఫైనల్లో శాతవాహన కాలేజి రెండు వికెట్ల తేడాతో ఎమరాల్డ్స్‌ జూనియర్‌ కాలేజి (తిరుపతి, చిత్తూరు) జట్టుపై నెగ్గింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఎమరాల్డ్స్‌ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 80 పరుగులు చేసింది. ప్రణయ్‌ (33 పరుగులు), గగన్‌ (15 పరుగులు) రాణించారు. శాతవాహన కాలేజి బౌలర్‌ ఉదయ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.

81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాతవాహన కాలేజి 9.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసి విజయం సాధించింది. వాసు (19), ఉదయ్‌ (18), సోమేశ్‌ (28 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. ఉదయ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవార్డు లభించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఎమరాల్డ్స్‌ కాలేజి 20 పరుగుల ఆధిక్యంతో చీరాల పాలిటెక్నిక్‌ కాలేజి (ప్రకాశం) జట్టును ఓడించి ఫైనల్‌ చేరింది. తొలుత ఎమరాల్డ్స్‌ జట్టు 10 ఓవర్లలో మూడు వికెట్లకు 90 పరుగులు చేసింది. సోహన్‌ (47), గగన్‌ (28) దూకుడగా ఆడారు. అనంతరం 91 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చీరాల పాలిటెక్నిక్‌ కాలేజీ జట్టు 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసి ఓడిపోయింది. జూనియర్స్‌ విభాగంలో చీరాల పాలిటెక్నిక్‌ కాలేజి మూడో స్థానంలో నిలిచింది.  

ఖాదర్‌ వలీ విజృంభణ
సీనియర్స్‌ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్‌ డిగ్రీ కాలేజి (ఎస్‌ఎస్‌బీఎన్‌–అనంతపురం), కృష్ణ చైతన్య డిగ్రీ, పీజీ కాలేజి (నెల్లూరు) జట్ల మధ్య ‘బెస్ట్‌ ఆఫ్‌ త్రీ’ పద్ధతిలో ఫైనల్స్‌ నిర్వహించారు. గురువారం చెరో మ్యాచ్‌లో నెగ్గి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. శుక్రవారం జరిగిన చివరి ఫైనల్‌ మ్యాచ్‌లో ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్ల తేడాతో కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజిపై విజయం సాధించి ఓవరాల్‌గా 2–1తో టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కృష్ణ చైతన్య కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది. ఫారూఖ్‌ 18 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజి బౌలర్‌ ఖాదర్‌ వలీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

73 పరుగుల లక్ష్యాన్ని ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజి 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అధిగమించి గెలిచింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో అదరగొట్టిన ఖాదర్‌ వలీ బ్యాటింగ్‌లోనూ రాణించి 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ రోషన్‌ 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన ఖాదర్‌ వలీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. విజేత జట్లకు కేఎల్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వైవీఎస్‌ఎస్‌ఎస్‌యూ ప్రసాద రావు, సాక్షి రెసిడెంట్‌ ఎడిటర్‌ ఎం.రమణమూర్తి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి జనరల్‌ మేనేజర్‌ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, సాక్షి విజయవాడ బ్రాంచ్‌ మేనేజర్‌ సింహాద్రి అప్పన్న, హెచ్‌ఆర్‌ సంతోష్, ఈవెంట్‌ ఆర్గనైజర్‌ శ్రీహరి పాల్గొన్నారు.  

జూనియర్స్‌ విభాగంలో ఉదయ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’... గగన్‌ ‘బెస్ట్‌ ఆల్‌రౌండర్‌’... సోహన్‌ ‘బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌’... ఉదయ్‌ ‘బెస్ట్‌ బౌలర్‌’ అవార్డులు గెల్చుకున్నారు. సీనియర్స్‌ విభాగంలో ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజికి చెందిన ఖాదర్‌ వలీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’... మహేంద్ర ‘బెస్ట్‌ ఆల్‌రౌండర్‌’... రోహిత్‌ రోషన్‌ ‘బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌’... ఖాదర్‌ వలీ ‘బెస్ట్‌ బౌలర్‌’ పురస్కారాలు అందుకున్నారు.

సీనియర్స్‌ విభాగంలో విజేతగా నిలిచిన ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజి (అనంతపురం) జట్టు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు